Begin typing your search above and press return to search.

జగన్ అందుకే ఓడారు...జేడీ మార్కు విశ్లేషణ

ఇక వైసీపీ హయాంలో కొన్ని మంచి పనులు కూడా జరిగాయని జేడీ చెప్పడం విశేషం.

By:  Satya P   |   8 Aug 2025 9:00 PM IST
జగన్ అందుకే ఓడారు...జేడీ మార్కు విశ్లేషణ
X

జేడీ ఇంటి పేరుగా మార్చుకున్న మాజీ సీబీఐ అధికారి వీవీ లక్ష్మీనారాయణ 2018 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 2019లో జనసేనలో చేరి విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసి రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు సాధించారు. ఆ తరువాత ఆయన జనసేన నుంచి వేరు పడ్డారు. ఇక 2024 ఎన్నికలకు ముందు ఆయన సొంతంగా పార్టీ జై భారత్ పేరుతో పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇదిలా ఉంటే ఆయన రాజకీయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు సైతం చేస్తూ ఉంటారు.

జగన్ ఓటమి వెనక :

ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఒక ఒక ప్రముఖ చానల్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలను పంచుకున్నారు. అందులో ప్రధానమైంది ఆసక్తికరమైనది చూస్తే ఏపీలో వైసీపీ ఎందుకు ఓటమి పాలు అయింది అన్నది. వైసీపీ అయిదేళ్ళ పాలనలో మంచి జరిగిందని అలాగే ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రకాలుగా సాగిన ప్రచారం వల్ల జగన్ ఓటమి పాలు అయ్యారని ఆయన పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ సర్కార్ ని దించేయడంతో కీలక పాత్ర పోషించింది అని అన్నారు.

జనాలు గట్టిగా నమ్మారు :

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వం తమ భూములు లాక్కుంటుందేమో అని జనాలు బలంగా నమ్మారు అని జేడీ చెప్పారు. పట్టాదారు పాస్ బుక్కుల మీద జగన్ బొమ్మ అలాగే భూములలో పాతిన సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మ ఉండడంతో కచ్చితంగా తమ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని వారు భయపడ్డారు అని అన్నారు. అంతే కాకుండా న్యాయవాదులు కూడా ఊరూరా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చేసిన ఆందోళనలు కూడా జనాలలో కలవరాన్ని పెంచాయని అన్నారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేంద్రం తీసుకుని వచ్చినది అని ఆయన గుర్తు చేశారు. ఇక కూటమి పార్టీలు కూడా ఇదే విషయం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా వైసీపీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా చేసింది అన్నారు.

లా అండ్ ఆర్డర్ విషయంలో :

ఇక ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా గత అయిదేళ్ళలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రభుత్వం మీద విమర్శలు వచ్చేలా చేశాయని అన్నారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ మీద పోలీసుల వేధింపులు ఆయన అనూహ్యంగా మరణించడం అలాగే ఇతరత్రా కూడా ఇబ్బందులు అన్నీ జనాల్లో చర్చకు వచ్చాయని ఈ కారణాలు అన్నీ కలసి జగన్ ని ఓటమి పాలు అయ్యేలా చేశాయని చెప్పారు.

మంచి పనులు చేసినా :

ఇక వైసీపీ హయాంలో కొన్ని మంచి పనులు కూడా జరిగాయని జేడీ చెప్పడం విశేషం. తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాల రూపూ రేఖలు బాగా మారిపోయాయని దానికి కారణం వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో తీసుకున్న అభివృద్ధి చర్యలు అని అన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో సైతం గణనీయమైన మార్పులు తెచ్చారని అన్నారు. అలాగే ఒక డేట్ టైం పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం వివిధ పధకాల లబ్దిదారులకు సంక్షేమ పధకాలను అందిస్తూ వచ్చారని అలా అయిదేళ్ళలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా జనం ఖాతాలలో వేశారు అన్నారు.

అయితే ఎన్ని చేసినా టీడీపీ కూటమి పార్టీలు కలవడంతో వారి బలం పెరిగిందని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా గట్టిగా పనిచేయడం తోనే జగన్ సర్కార్ గద్దె దిగిందని జేడీ లక్ష్మీ నారాయణ తనదైన శైలిలో విశ్లేషించారు. ఇపుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.