జేసీ చేసిన ఆ ఒక్క తప్పే.. శాపంగా మారిందా ..!
పెద్దారెడ్డి విషయానికి వస్తే.. ఆయన కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాక కూడా.. నియోజకవర్గంలోకి రాకుండా జేసీ అడ్డుకున్నారన్నది వాస్తవం.
By: Garuda Media | 29 Oct 2025 2:00 AM ISTఒక్క తప్పే కావొచ్చు.. అది చిన్నదైనా.. పెద్దదైనా.. ఒక్కొక్క సారి నాయకులను పట్టిపీడిస్తుంది. ఇదే ఇప్పుడు అనంతపురంజిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా పట్టిపీడిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గత 5 సంవత్సరాల్లో అప్రతిహతంగా ముందుకు సాగాలని అనుకున్నప్పటికీ.. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూకుడు కారణంగా జేసీ వర్గం వెనుకబడింది. గత ఎన్నికల్లో తను పోటీ నుంచి తప్పుకొని కుమారుడికి అవకాశం ఇచ్చారు.
అస్మిత్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. కానీ, కుమారుడి కంటే కూడా.. 75 ఏళ్ల వయసున్న జేసీ దూకు డుగా వ్యవహరిస్తున్నారు. అన్నీ తానై వ్యవహిస్తున్నారు. సరే.. రాజకీయాల్లో చింతచచ్చినా పులుపు చావద న్నట్టుగా నాయకులు చెలరేగడం సీమలో మామూలే. కానీ.. అధినేతనే ధిక్కరిస్తే..? అధినేత మాటకు కూడా విలువ ఇవ్వకపోతే..? ఇదే ఇప్పుడుజేసీని పట్టుకుని పీడిస్తున్న ప్రధాన సమస్య. ఏసీపీ విషయంలో నే కాదు.. పెద్దారెడ్డి విషయంలోనూ రెండు కీలక అంశాల్లో జేసీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
పెద్దారెడ్డి విషయానికి వస్తే.. ఆయన కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాక కూడా.. నియోజకవర్గంలోకి రాకుండా జేసీ అడ్డుకున్నారన్నది వాస్తవం. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులను పాటించాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో వినీ విననట్టే జేసీ వ్యవహరించారు. దీంతో వివాదం ముదిరి.. హైకోర్టు వరకు మరోసారి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇది చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది.
ఇక, రెండో విషయానికి వస్తే.. కడపలోని విద్యుత్తు ఫ్యాక్టరీ ల నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద విషయంలో బీజేపీ ఎమ్మెల్యే(మాజీ టీడీపీ నేత) జమ్మలమడుగు శాసన సభ్యుడు ఆదినారాయణ రెడ్డితో జేసీ వివాదానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు నిప్పులు చెరగడం.. లారీలను ఆపేయడం గత మూడు మాసాల కిందట సంచలనం రేపింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న చంద్రబాబు.. ఇరువురినీ అమరావతికి రమ్మన్నారు.
ఆదినారాయణ రెడ్డి వచ్చారు కానీ.. జేసీ మాత్రం రాలేదు. ఇది కూడా బాబుకు ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ రెండు కూడా అధినేతను ధిక్కరించేవిగానే ఉన్నాయని భావిస్తున్న నాయకులు జేసీని పక్కన పెట్టారు. అందుకే.. ఇప్పుడు జేసీ పట్టుబడుతున్నా.. ఓ పోలీసు అధికారిని ట్రాన్స్‌ఫర్ చేయకపోగా.. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పెంచారు.
