Begin typing your search above and press return to search.

పదవి దిగిపోతూ జేసీ హాట్ కామెంట్స్ !

తాడిపత్రి మునిసిపాలిటీకి చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి 2021లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆ పదవిలోకి వస్తారు అని ఎవరూ అనుకోలేదు.

By:  Satya P   |   18 March 2026 1:55 PM IST
పదవి దిగిపోతూ జేసీ హాట్ కామెంట్స్ !
X

తాడిపత్రి మునిసిపాలిటీకి చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి 2021లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆ పదవిలోకి వస్తారు అని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన 2014లో తాడిపత్రి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎమ్మెల్యేగా పనిచేసిన వారు చైర్మన్ పదవిని ఎలా చేపడతారు అని అనుకోవచ్చు. కానీ జేసీ ప్రభాకర రెడ్డి రూటే సెపరేట్ కదా. అందుకే ఆయన తానే స్వయంగా పదవిలో ఉంటే తప్ప తాడిపత్రి పొలిటికల్ గా లైన్ లోకి రాదని వేసిన సూపర్ ప్లాన్ ఇది. దాంతో తన స్థాయిని తగ్గించుకుని మరీ చైర్మన్ అయ్యారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి గుండె కాయ లాంటి చైర్మన్ పదవిని జేసీ చేపట్టడం వల్లనే టీడీపీ అక్కడ మళ్ళీ పుంజుకుంది. అది 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాగా కనిపించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయారు.

దేశంలోనే నంబర్ వన్ :

దేశంలోనే తాడిపత్రి నంబర్ వన్ అంటూ తన చైర్మన్ పదవి విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జేసీ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఒక చైర్మన్ గా కాకుండా తాడిపత్రి మునిసిపాలిటీని తన సొంత ఇల్లుగా చేసుకుని పాలన చేశాను అన్నారు. ఇంట్లో వారి కోసం ఎలా కష్టపడతామో అలాగే తాను మునిసిపాలిటీ అభివృద్ధి కోసం కష్టపడ్డామని అన్నారు. మునిసిపాలిటీ ఆస్తులను అన్నీ రిజిస్ట్రేషన్ చేయించామని అలాగే ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా కానీయ కుండా గూగుల్ మాపింగ్ చేయించామని చెప్పుకొచ్చారు.

రెండు వేల కోట్ల ఆస్తి :

ఈ రోజున చూస్తే తాడిపత్రి మునిసిపాలిటీ రెండు వేలకు పైగా కోట్ల ఆస్తులతో ఉంది అంటే దానికి కారణం తన పనితనం అని జేసీ చెప్పారు. వేరే ఎవరు ఉన్నా ఈ విధంగా చేసే వారు కాదని ఆయన అన్నారు. తాను తాడిపత్రిని అభివృద్ధి పధంలోకి తెచ్చాను అని చెప్పారు. అధికారులు సహా ఎవరూ కూడా తన జోరుకు స్పీడ్ కి అసలు మ్యాచ్ కారంటూ జేసీ హాట్ కామెంట్స్ చేశారు.

బాధ్యత లేదంటూ :

బాధ్యత గురించి మాట్లాడుతూ జేసీ ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మందికి బాధ్యత లేకుండా పోతోందని ఎంత సేపూ తమ కుటుంబం తాము అన్నట్లుగానే ఉంటున్నారని జేసీ విమర్శించారు. కానీ తాను అలా కాదని అందుకే ఆస్తులు తాను మునిసిపాలిటీకి కూడబెట్టాను అన్నారు. మునిసిపాలిటీ ఆస్తులను ఎవరూ ఏమీ చేయకుండా చట్టబద్ధంగా ఏమి చేయాలో అన్నీ చేశాను అన్నారు. అంతటితో ఆగకుండా ఆయన అధికారుల మీద సెటైర్లు వేశారు. కమిషనర్ ని సైతం ఆటపట్టిస్తూ ఆయన బుర్ర గట్టింది అని కామెంట్స్ చేశారు.

రిటైర్ అయినట్లేనా :

జేసీ ఎమ్మెల్యే చేశారు, తిరిగి చైర్మన్ చేశారు, ఇపుడు ఆయన ఏమి చేయబోతున్నారు అని అంతా చర్చించుకుంటున్నారు. ఏడున్నర పదుల వయసులో ఉన్న ప్రభాకర్ రెడ్డి తన వారసుడిగా పవన్ ని ముందు పెట్టారు. తాను చైర్మన్ గా అనాడు చేయడం వెనక కూడా రాజకీయ వ్యూహం ఉంది. ఇపుడు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆయన రిటైర్ అవుతారా లేక మరోసారి చైర్మన్ గా పనిచేసేందుకు సిద్ధపడతారా అన్నది పార్టీలో చర్చ సాగుతోంది. పదవీ విరమణ వేళ కూడా ఎక్కడా తన తగ్గకుండా హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చిన జేసీ రాజకీయం ఇప్పట్లో ఆగేలా లేదని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే జేసీ ప్రభాకరరెడ్డి ఒక విలక్షణమైన నాయకుడిగానే చెప్పాల్సి ఉంది.