Begin typing your search above and press return to search.

మాధవీలత విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర నిర్ణయం!

తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేత, సినీనటి మాధవీలత మధ్య ఈ ఏడాది ప్రారంభంలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణ సందర్భంగా మొదలైన ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   27 Dec 2025 9:54 AM IST
మాధవీలత విషయంలో జేసీ ప్రభాకర్  రెడ్డి ఆసక్తికర నిర్ణయం!
X

తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేత, సినీనటి మాధవీలత మధ్య ఈ ఏడాది ప్రారంభంలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణ సందర్భంగా మొదలైన ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై మాధవీలత కామెంట్స్ తో మొదలైన ఈ వ్యవహారం.. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్షన్ తో ఒక్కసారిగా వేడెక్కింది.

ఈ క్రమంలో పోలీసు కేసులు, వరుస ఫిర్యాదులు, ఘాటు విమర్శల అనంతరం.. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్న పరిస్థితి! ప్రధానంగా మాధవీలతపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెబుతూ.. ఆవేశంలో అలా జరిగిపోయింది అని వ్యాఖ్యానించారు! దీంతో ఈ వ్యవహారం టీకప్పులో తుఫానులా ముగిసిపోయింది! ఈ నేపథ్యంలో మళ్లీ న్యూ ఇయర్ వేడుకలు రావడంతో ఈసారి జేసీపీ కొత్త ఆలోచన చేశారు.

అవును... గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను జేపీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో నిర్వహించాలని తలంచారు! అయితే ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా.. గతంలో ఈ వేడుకపై తీవ్ర విమర్శలు చేసిన మాధవీలతనే ఈసారి వేడుకలకు చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నామని తెలిపారు. అయితే.. ఆమె వస్తుందో లేదో మాత్రం తమకు తెలియదని అన్నారు. దీంతో.. ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి మాధవీలత.. తాడిపత్రిలోని నూతన సంవత్సరం వేడుకలకు హాజరవుతారా.. లేక, లైట్ తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. అయితే గతంలో ఇద్దరి మధ్యా తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నా.. తర్వాత తాము కాంప్రమైజ్ అయ్యామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈసారి వేడుకలకు ఆమె చీఫ్ గెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు!

కాగా... 2024 డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై మాధవీలత కామెంట్స్ తో ‘జేసీపీ వర్సెస్ మాధవీలత’ వ్యవహారం మొదలైన సంగతి తెలిసిందే. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నిస్తూ.. అలాంటి వేడుకలకు వెళ్లొద్దని మాధవీలత సూచించారు! దీంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా భగ్గుమన్నారు.

ఇందులో భాగంగా.. మాధవీలత కామెంట్స్ ని తప్పుబడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఊహించని స్థాయిలో స్పందించారు! దీంతో తనను కించపరిచేలా జేసీ మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని చెబుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా తెలిపారు. అలా రకరకాల కేసులు, ఆరోపణల అనంతరం.. పరస్పర సారీలతో నాడు ఆ ఎపిసోడ్ ముగిసింది!