అస్మిత్ పాలిటిక్స్.. ఆనందమేనా..!
అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈయన పరిస్థితి ఏ విధంగా ఉంది.. అనేది క్షేత్రస్థాయిలో గమనిస్తే భారీగా పుంజుకోవలసిన అవసరం కనిపిస్తోంది.
By: Garuda Media | 1 April 2026 10:00 AM ISTరాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క తీరు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంది.. ఏ విధంగా వారు పుంజుకోవాలి.. అనే విషయాలను గమనిస్తే కొంతమంది నాయకులు చాలా మార్పు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన వారసులు మరింత ఎక్కువగా తమ పనితీరును మెరుగుపరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తున్న నాయకుడు అస్మిత్ రెడ్డి. తాడిపత్రి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన జెసి కుటుంబానికి చెందిన వారసుడు.
అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈయన పరిస్థితి ఏ విధంగా ఉంది.. అనేది క్షేత్రస్థాయిలో గమనిస్తే భారీగా పుంజుకోవలసిన అవసరం కనిపిస్తోంది. యువత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ మిగిలిన వర్గాల ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు అస్మిత్ రెడ్డి చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం టిడిపిలో ఏర్పడుతుంది. మరింత పరిణితి చెందాల్సిన అవసరంతో పాటు క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడంతో పాటు అందరికీ చేరువ అయ్యేలాగా వ్యవహరించాలని కూడా సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించడం వేరు వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం వేరు అని చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో వైసిపి పై ఉన్న వ్యతిరేకత కావచ్చు లేదా జేసీ కుటుంబం నుంచి వచ్చాడన్న సానుభూతి కావచ్చు. మొత్తంగా గత ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి మాత్రం పూర్తిగా ఎమ్మెల్యే పనితీరు.. ఆయన వ్యవహరించే విధానం.. ప్రజలతో కలివిడిగా ఉండే తత్వంతో పాటు కచ్చితంగా క్షేత్రస్థాయిలో అనేక అంశాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి వీటి పరంగా చూసుకున్నప్పుడు అస్మిత్ రెడ్డి చాలా పుంజుకోవలసిన అవసరం ఉందని ఇటు నాయకులు అటు పరిశీలకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకోవాలి.
అవి సమాజంలో ఎంతమందికి అందుతున్నాయి.. అందని వారు ఎవరు అనే విషయంపై పూర్తిగా సమాచారం సేకరించుకోవాలి. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు, ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేసేలా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. వారసత్వం అనేది ఒకసారి మాత్రమే పని చేస్తుందన్న విషయాన్ని అస్మిత్ రెడ్డి కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలనేది కీలక సూచన. తర్వాత మెరుగైన పనితీరుతోనే విజయం సాధించగలరన్నది వాస్తవం. గడిచిన 21 నెలల్లో అస్మిత్ రెడ్డి పనితీరుకు చంద్రబాబు దగ్గర దక్కిన మార్కులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి అన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఆయన మీద కోపంతోనో లేకపోతే ద్వేషంతోనో చెబుతున్న మాట కాదు వాస్తవమే చెబుతున్నారు.
కానీ.. అస్మిత్ రెడ్డి అన్ని వర్గాలను కలుపుకొని పోవడం లేదు. ముఖ్యంగా పార్టీలోనూ.. సీనియర్ నాయకులతో ఆయన కలివిడిగా ఉండటం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. దీనిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం కూడా ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం పనిచేస్తున్న తీరును కూడా ఆయన ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూసుకున్న గత ఎన్నికల మాదిరిగా అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదన్నది తాడిపత్రి నియోజకవర్గంలో అస్మిత్ రెడ్డికి ఎదురవుతున్న ప్రధాన సమస్య, మరి దీనిని ఆయన ఏ విధంగా చూస్తారు అనేది చూడాలి.
