సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లను వెనక్కి నెట్టారు.. ఎవరీ జయశ్రీ!
అవును... హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2025 ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్ గా పిచాయ్, నాదెళ్ల కాకుండా మరో వ్యక్తి నిలిచారు.
By: Raja Ch | 27 Dec 2025 6:28 PM ISTగత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ సాంకేతిక రంగంలో అత్యంత సంపన్నులైన భారతీయ సంతతికి చెందిన సీఈఓల గురించిన చర్చ ఎప్పుడూ సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల చుట్టూనే కేంద్రీకృతమైన సంగతి తెలిసిందే! ప్రపంచ సాంకేతిక రంగంలో ఈ భారతీయ సంతతి ద్వయం ప్రభావం అలాంటిది. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన రెండు కంపెనీలను నడుపుతున్న ఈ ఇద్దరూ ప్రస్తుతం భారత సంతతికి చెందిన నాయకుల్లో అగ్రస్థానంలో లేకపోవడం గమనార్హం!
అవును... హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2025 ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్ గా పిచాయ్, నాదెళ్ల కాకుండా మరో వ్యక్తి నిలిచారు. ఆ మహిళ మరెవరో కాదు.. అరిస్టా నెట్ వర్క్స్ అధ్యక్షురాలు, సీఈఓ జయశ్రీ ఉల్లాల్. తాజాగా ఈ ఘనత ఈమెకు దక్కింది. ఈమె నికర విలువ రూ.50,170 కోట్లు కాగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల రూ.9,770 కోట్లతో తర్వాతి స్థానంలో ఉండగా.. గూగుల్ సీఈఓ సుందర్ రూ.5,810 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు.
ఎవరీ జయశ్రీ ఉల్లాల్..!:
2008 నుంచి కంప్యూటర్ నెట్ వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్ వర్క్స్ కు నాయకత్వం వహిస్తున్నారు జయశ్రీ ఉల్లాల్. ఆమె నాయకత్వంలో 2024లో ఈ సంస్థ 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. ఇది 2023 ఆదాయం కంటే సుమారు 20% పెరుగుదల అని ఫోర్బ్స్ తెలిపింది. ఈ క్రమంలో.. ఈమె అరిస్టా నెట్ వర్క్స్ కంపెనీ స్టాక్ లో సుమారు 3శాతం వాటాను కలిగి ఉన్నారు.
బ్లూమ్ బెర్గ్ నివేదికల ప్రకారం.. ఆమె తన కెరీర్ ప్రారంభంలో సెమీకండక్టర్ రంగంలో గడిపారు. 1993లో సిస్కో కంపెనీని కొనుగోలు చేసినప్పుడు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న క్రెసెండో కమ్యూనికేషన్స్ లో ఆమె కెరీర్ వేగవంతం అయింది. ఈ క్రమంలో 2008లో ఆమె ఆ సంస్థను విడిచిపెట్టే ముందు సిస్కో స్విచ్చింగ్ విభాగాన్ని కంపెనీ ప్రధాన వ్యాపార విభాగాలలో ఒకటిగా అభివృద్ధి చేసింది.
అనంతరం.. అదే ఏడాది ఆమె అరిస్టా నెట్ వర్క్స్ లో చేరారు. ఆ సమయంలో అరిస్టాలో కేవలం 30 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. కాలక్రమేణా ఆమె క్లౌడ్ నెట్ వర్కింగ్ లో ఓ ప్రధాన పేరుగా అ సంస్థను మార్చడంలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఆమె శాన్ ఫ్రాన్సిస్కో లో స్థిరపడ్డారు.
మార్చి 27 - 1961లో లండన్ లో భారత సంతతికి చెందిన కుటుంబంలో జన్మించిన జయశ్రీ ఉల్లాల్... తన ఐదో ఏటనే భారత్ కు వలస వచ్చారు. అక్కడ భౌతిక శాస్త్రవేత్త అయిన ఆమె తండ్రి.. భారత్ లో విద్యా మంత్రిత్వ శాఖలో పని చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఏర్పాటుకూ దోహదపడ్డారు. ఆ సమయంలో జయశ్రీ.. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ లో చదువుకున్నారు.
అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోకు మకాం మార్చారు. ఈ క్రమంలో జయశ్రీ ఉల్లాల్.. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. తర్వాత 1986లో శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చేశారు. ఈ క్రమంలో... ఈ రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా.. ఆమెకు 2025లో ఇంజినీరింగ్ లో గౌరవ డాక్టరేట్ లభించింది.
