ఈసీటు తీసుకుని.. ఆ సీటు ఇస్తారా? : జయమంగళ బిగ్ ఆఫర్
కామినేని శ్రీనివాస్. బీజేపీ సీనియర్ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత.
By: Garuda Media | 18 Dec 2025 2:00 PM ISTకామినేని శ్రీనివాస్. బీజేపీ సీనియర్ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. బీజేపీ అధిష్టానం సహా.. రాష్ట్రంలోని కీలక నాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న వ్యక్తి కూడా. దీంతో ఆయన కైకలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పైగా.. వచ్చే ఎన్నికల నాటికి మారుతాయన్న చర్చ కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ.. ఈ సీటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జయ మంగళ వెంకటరమణ.. ఆ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇది ఇంకా ఆమోదం పొందలేదు. ఇది పూర్తయితే.. ఆయన ఈ సీటును వదులుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై టీడీపీ అదినేతకు కూడా ఆయన చూచాయగా చెప్పారని పార్టీ నాయకులు అంటున్నారు. గతంలో ఎమ్మెల్సీలుగా చేసిన చాలా మంది ప్రస్తుతం అవకాశాల్లేక చూస్తున్నా రు. దీంతో వారికి ఈ సీటు ఇచ్చేసి.. వచ్చే ఎన్నికల్లో జయమంగళకు కైకలూరు ఇవ్వాలన్నది ప్రతిపాదన.
తద్వారా.. తన అస్తిత్వాన్ని నిలుపుకొనేందుకు జయమంగళ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మె ల్సీ సీటును త్యాగం చేశారు. ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ నాయకుడు, కైకలూరు ఎమ్మెల్యే కామినేనిని తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన నియోజకవర్గంలో కనిపించకపోవడం.. సమస్య లు పట్టించుకోకపోవడం వంటివి ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అయితే.. బీజేపీలో ఈ చర్చ పెద్దగా లేకపోయినా.. కూటమి పార్టీల్లో మాత్రం కనిపిస్తోంది. కామినేని పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదన్న చర్చ ఉంది.
ఇది జయమంగళకు కలిసి వస్తోంది. ఇక, వైసీపీ ఎలా ఉన్నా.. తనను గెలిపిస్తారన్న ఆశతో ఆయన ఉన్నా రు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నా.. ఎన్నికల సమయానికి బీసీ కోటాలో అయినా ఈ సీటును దక్కించుకునేందుకు జయమంగళ ప్రయత్నిస్తున్నారు. ఇది సాకారమైతే.. బీజేపీ ఈ సీటును వదులుకుంటుందా? అనేది చూడాలి. అంతేకాదు.. కామినేని తప్పుకొంటారా అనేది కూడా కీలకంగా మారింది. సో.. మొత్తానికి జయమంగళ అయితే.. కర్చీఫ్ పట్టుకుని రెడీగా ఉన్నారు. బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
