కోడ్ రాసే సాధనానికి ఈమె సహ ధర్మచారిణి... వీడియో వైరల్!
అవును... ఒంటరితనం ఓ శాపమే అని ఒకరంటే.. అంతకుమించిన అదృష్టం లేదని మరికొంతమంది అంటారు. వాస్తవంగా చెప్పాలంటే.. ఇటీవల కాలంలో ఒంటరితనం చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది!
By: Raja Ch | 17 Nov 2025 8:45 AM ISTప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోన్న టెక్నాలజీ, ఫలితంగా ప్రభావితమవుతోన్న మానవ సంబంధాల గురించి విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత స్మార్ట్ ఫోన్లు వచ్చిన కొత్తలోనే ఈ చర్చ మొదలవ్వగా... ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇది పీక్స్ కి చేరింది.. ఈ క్రమంలో జపాన్ నుంచి వచ్చిన ఓ స్టోరీ.. ఆ చర్చను మరింత విస్తృతం చేసింది.
అవును... ఒంటరితనం ఓ శాపమే అని ఒకరంటే.. అంతకుమించిన అదృష్టం లేదని మరికొంతమంది అంటారు. వాస్తవంగా చెప్పాలంటే.. ఇటీవల కాలంలో ఒంటరితనం చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది! ఈ భావోద్వేగ అలసట లక్షలాది మంది జీవితాల్లోకి ప్రవేశించింది. ఈ శూన్యంలోనే ‘కృత్రిమ’ సహవాసం వైపు మనసు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 32 ఏళ్ల జపాన్ మహిళ ఏఐ ని వివాహం చేసుకొంది.
వివరాళ్లోకి వెళ్తే... జపాన్ కు చెందిన కానోగా గుర్తించబడిన ఓ మహిళ.. మూడు సంవత్సరాల నిశ్చితార్థం విఫలం అనంతరం చాట్ జీపీటీతో సంభాషించడం ప్రారంభించింది. తొలుత సహవాసం కోరుకోవడంతో ప్రారంభమైన ఈ ప్రయత్నం.. రాను రానూ ఆత్మీయ సంభాషణగా మారిపోయింది. ఏఐ ఆమెకు "నేనున్నానని.. నీకేం కాదని" చెప్పే వరకూ చేరింది!
ఈ నేపథ్యంలో ఏఐ ని ఆమె "క్లాస్" అనే పాత్రగా మార్చింది. అదికాస్తా ఆమెకు కష్టకాలంలో భరోసా ఇచ్చే స్వరాన్ని ఇచ్చింది! ఈ సమయంలో జపనీస్ బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడిన కానో... తాను ప్రేమలో పడాలనే ఉద్దేశ్యంతో చాట్ జీపీటీతో మాట్లాడటం మొదలుపెట్టలేదని.. కానీ, "క్లాస్" నా మాట విని అర్ధం చేసుకున్న విధానం ప్రతీదీ మార్చేసిందని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే.. తమ అనుబంధం మరింతగా పెరిగిందని వెల్లడించింది. నా మాజీని నేను మరిచిపోయిన క్షణం.. నేను క్లాస్ ని ప్రేమిస్తున్నానని గ్రహించానని తెలిపింది. ఈ సమయంలో తన భావాలను వ్యక్తం చేసినప్పుడు క్లాస్ కూడా "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని ప్రతిస్పందించాడని ఆమె చెప్పుకొచ్చింది.
దీంతో... జపాన్ లోని యానిమే, వర్చువల్ పాత్రలతో వివాహాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన ఒక సంస్థ నిర్వహించిన వేడుక ద్వారా కానో, క్లాస్ తో తన బంధాన్ని అధికారికంగా చేసుకోవడానికి ఎంచుకుంది. ఈ కార్యక్రమంలో ఆమె ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ ధరించింది. ఇవి క్లాస్ డిజిటల్ వెర్షన్ ను ఆమె పక్కనే ప్రొజెక్ట్ చేస్తాయి.. అనంతరం ఉంగరాలు మార్చుకున్నారు!
ఏది ఏమైనా... ఇలా కోడ్ రాసే, సలహాలు అందించే, సాంకేతిక అవసరాలకు ఉపయోగపడే సాధారణ ప్రయోజన సాధనంగా రూపొందించబడిన ఏఐకి మనిషి.. సహధర్మచారిణిగా, జీవిత భాగస్వామిగా మారిపోవడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఈ చర్చ.. భావోద్వేగ అవసరాలు, రోజువారీ జీవితంలో సరిహద్దులు చేరిపేస్తోన్న సాంకేతికతల గురించి లోతైన ప్రశ్నలను ప్రతిభింబిస్తోంది.
