రెండు గంటలే నిద్ర...పని రాక్షసురాలుగా మహిళా ప్రధాని
ఆ మహిళా ప్రధానికి రోజులో ఇరవై నాలుగు గంటలు ఏ మాత్రం సరిపోవడం లేదుట. ఆమె నిరంతరం పనిచేస్తూనే ముందుకు సాగుతున్నారుట.
By: Satya P | 18 Nov 2025 9:40 AM ISTఆ మహిళా ప్రధానికి రోజులో ఇరవై నాలుగు గంటలు ఏ మాత్రం సరిపోవడం లేదుట. ఆమె నిరంతరం పనిచేస్తూనే ముందుకు సాగుతున్నారుట. ఇక నిద్రకు ఆమె కేటాయించే సమయం వింటే షాక్ తినాల్సిందే. జస్ట్ రెండు గంటలు మాత్రమే పడుక్కుంటారుట. ఇంతకీ ఆమె ఎవరో కాదు జపాన్ కి తొలి ప్రధానిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సనాయే తకాయిచి. ఈ విషయాన్ని ఆమె ఏకంగా పార్లమెంటులోనే వ్యాఖ్యానించారు. తనకు పనిలోనే ఎక్కువ ఆనందం అంటున్నారు. పనిలోనే ఆమె నిబద్ధతను అంతా కొనియాడుతూనే మరీ బొత్తిగా అంత తక్కువ నిద్ర ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు.
మంచిది కాదంటూ :
అయితే జపాన్ ప్రధాని సనాయే తకాయిచి రెండు గంటల నిద్ర అంతర్జాతీయ స్థాయిలోనే చర్చగా మారింది. అలా చెబుతున్న ఈ మాటల మీద వైద్య నిపుణులు అయితే ఇది మంచి పద్ధతి కాదు అని అంటున్నారు. ప్రతీ ఒక్కరికీ కనీసంగా ఏడు గంటలకు తక్కువ కాకుండా నిద్ర ఉండాలని వారు సూచిస్తున్నారు అలా కాకుండా ఏ మాత్రం నిద్ర తగ్గినా శారీరక సమస్యలు అనేకం వస్తాయని హెచ్చరిస్తున్నారు. నిద్ర లేమితో అరోగ్యం మీద తెవ్ర ప్రభావం ఉంటుందని అలెర్ట్ చేస్తున్నారు.
మందు తాగినట్లేనట :
నిద్ర లేమితో బాధపడుతున్న వారు మందు తాగిన వారూ ఒక్కటే అని రెండూ ఆరోగ్యానికి పూర్తిగా హానికరమని వైద్య నిపుణులు అంటున్నారు. నిద్ర బాగా లేకపోతే అది కాస్తా నేరుగా మెదడు మీదనే ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మెదడులోని నరాల మధ్య సంబంధాలు దెబ్బ తినడం వీక్ అవడం జరుగుతుందని చెబుతున్నారు.రోజులో ఎక్కువగా మేలుకుని ఉంటే రక్తంలో ఏకంగా 0.05% ఆల్కహాల్ కలసి ఉన్నట్లే అని అంటున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ అయితే ఇదే విషయం మీద 2017లో జరిపిన ఒక అధ్యయనం స్పష్టంగా చెప్పింది.
జపాన్ లో వర్క్ కల్చర్ :
జపాన్ గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. అక్కడ ప్రజలు పన్నెండు కోట్ల మంది ఉంటారు. వృద్ధులు కూడా ఎక్కువగా చురుకుగా పనిచేస్తారు. ప్రతీ ఒక్కరూ ఖాళీగా ఉండడానికి అసలు ఇష్టపడరు, బస్సు స్టాండ్ లో వేచి ఉండే సమయంలో కూడా ఏదో పని చేస్తూ కనిపిస్తారు. అంత పని వ్యసనపరులుగా వారు ఉంటారు. ఇక జపాన్ ప్రధాని అయితే మరీ ఎక్కువగా పని చేస్తారు అని అంటున్నారు. కానీ జపాన్ లో ప్రతీ ఒక్కరూ ఇలా అధికంగా చేయడం వల్ల జపాన్ లాంటి దేశంలో కొత్త రకమైన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అక్కడ వారికి తీవ్రమైన నిద్రలేమితో అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి కొత్త ప్రధాని తాను నిద్ర పోతూ జనాలను కూడా తగినంత నిద్రపోమని కొత్త సలహా సూచనలు ఇస్తారా అన్నదే చర్చ.
