ఆ దేశంలో భర్త మొత్తం జీతం భార్య చేతికే.. భర్త ఖర్చుల కోసం భార్యే ఇవ్వాలి..!
జపాన్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. టెక్నాలజీలోనే కాదు, కుటుంబ నిర్వహణలో కూడా వారి పద్ధతులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆ దేశంలో గృహిణి పాత్ర చాలా కీలకం.
By: Tupaki Political Desk | 10 April 2026 5:00 PM ISTజపాన్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. టెక్నాలజీలోనే కాదు, కుటుంబ నిర్వహణలో కూడా వారి పద్ధతులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆ దేశంలో గృహిణి పాత్ర చాలా కీలకం. సంపాదన భర్తది కావచ్చు కానీ, ఆ సంపదపై పెత్తనం మాత్రం భార్యదే కావడం జపాన్ సంస్కృతిలో రాసుకోలేని నియమం.
సంపాదన భర్తది.. పెత్తనం భార్యది!
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పురుషాధిక్యత కనిపిస్తుంది. కానీ జపాన్ గడప దాటి లోపలికి వెళ్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ ఇల్లు నడిపించే విషయంలో భార్యదే అంతిమ నిర్ణయం. ఎంతటి హోదాలో ఉన్న భర్తయినా సరే, నెల ఆఖరున తన జీతం కవర్ మొత్తాన్ని భార్య చేతికి అందించాల్సిందే. ఆ తర్వాత తన సొంత ఖర్చుల కోసం చిన్న పిల్లాడిలా ఆమె ముందు చేయి చాపాల్సిందే. జపాన్ గృహిణుల పొదుపు మంత్రం, వారి కుటుంబ నిర్వహణ శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
భర్త చేతి ఖర్చుల లెక్క
జపాన్‌లో భర్తకు భార్య ఇచ్చే ‘పాకెట్ మనీ’'ని ఓకోజకాయ్ అని పిలుస్తారు. జీతం మొత్తం తీసుకున్న భార్య, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, పొదుపు పక్కన పెట్టి.. చివరగా భర్త వ్యక్తి గత ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని కేటాయిస్తుంది. ఆ నిర్ణీత డబ్బుతోనే భర్త నెలంతా నెట్టుకురావాలి. ఒకవేళ ఆ నెలలో ఎక్కువ ఖర్చు చేస్తే, మళ్లీ భార్యను బతిమిలాడాల్సిందే తప్ప ఆయనకు సొంతంగా ఖర్చు చేసే అధికారం ఉండదు.
భార్యలే ఎందుకు..
జపాన్ పురుషులు ఆఫీసు పనిలో బిజీగా ఉంటారు. పొద్దున్నే వెళ్తే రాత్రి ఎప్పుడో వస్తారు. దీంతో ఇంటి బాధ్యతలను భార్యలే పూర్తిగా చూసుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణలో జపాన్ మహిళలు కఠినంగా ఉంటారు. భర్తలు సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా, భవిష్యత్తు అవసరాల కోసం వారు చేసే పొదుపు అద్భుతంగా ఉంటుంది. అందుకే అక్కడ గృహిణులను ‘కుటుంబ ఆర్థిక మంత్రులు’ అని పిలుస్తారు.
తగ్గుతున్న పాకెట్ మనీ
గత కొన్ని ఏళ్లుగా జపాన్ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల వల్ల భర్తల పాకెట్ మనీ కూడా తగ్గుతూ వస్తోంది. ఒక సర్వే ప్రకారం, 1990లలో ఉన్న పాకెట్ మనీతో పోలిస్తే ప్రస్తుతం భర్తలకు అందుతున్న మొత్తం సగానికి పడిపోయిందని తేలింది. దీంతో జపాన్ పురుషులు మధ్యాహ్నం భోజనం దగ్గర కూడా పొదుపు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయినప్పటికీ, కుటుంబం కోసం భార్య చేసే పొదుపును వారు గౌరవిస్తారు.
బయటి ప్రపంచానికి ఇది భర్తను అదుపులో ఉంచడంలా అనిపించవచ్చు కానీ, జపాన్ వాసుల దృష్టిలో ఇది ఒక సమర్థవంతమైన కుటుంబ నిర్వహణ. భర్త సంపాదనపై దృష్టి పెడితే, భార్య ఆ సంపాదనను సార్థకం చేస్తుంది. ఈ పరస్పర అవగాహన వల్లే జపాన్ కుటుంబాలు ఆర్థికంగా చాలా స్థిరంగా ఉంటాయి. మన దేశంలో కూడా చాలా ఇళ్లలో తల్లులు ఇదే పద్ధతిని పాటిస్తుంటారు, కానీ జపాన్‌లో ఇది ఒక సామాజిక సంప్రదాయంగా మారిపోవడం విశేషం.
