మరో దేశానికి మహిళా ప్రధాని.. చరిత్రలో తొలిసారిగా ఎన్నిక
ప్రపంచంలో అణుబాంబు దాడికి గురైన ఏకైక, చిట్టచివరి దేశం జపాన్. సరిగ్గా 80 ఏళ్ల కిందట జరిగిందీ దాడి.
By: Tupaki Political Desk | 4 Oct 2025 4:14 PM ISTప్రపంచంలో అణుబాంబు దాడికి గురైన ఏకైక, చిట్టచివరి దేశం జపాన్. సరిగ్గా 80 ఏళ్ల కిందట జరిగిందీ దాడి. ఆ దెబ్బ నుంచి మిగతా దేశాలు ఇప్పటికీ కోలుకోలేకపోయేవి.. కానీ, ఎవరూ ఊహించని విధంగా జపాన్ ఆర్థికంగా అంతర్జాతీయ శక్తిగా ఎదిగింది.
ఇటీవల మన పొరుగుదేశం నేపాల్ లో హింస చెలరేగి.. ప్రధానమంత్రి ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పదవి దిగిపోయిన తర్వాత మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కిని ప్రధానిగా తాత్కాలికంగా ఎన్నుకున్నారు. దీంతో భారత ఉపఖండంలో నేపాల్ కు కూడా ఒక మహిళ ప్రధాని అయిన రికార్డు దక్కింది. ఇప్పుడు మరో దేశానికి కూడా మహిళా ప్రధాన మంత్రి వచ్చారు. అయితే, ఇది కూడా ఆ దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.
డెవలప్ సరే.. జెండర్ ఈక్వాలిటీ ఏది...?
ఎక్కడో అన్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా మహిళలు ప్రధానమంత్రులు అవుతున్నారు. బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలకూ మహిళలు దశాబ్దాల కిందటే ప్రధానులు అయ్యారు. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడి తర్వాత కొన్నేళ్లలోనే శాంతి కాముక దేశంగా మారి.. పని మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని డెవలప్ అయిన దేశం జపాన్. కానీ, అక్కడ ఇంతవరకు మహిళ ప్రధాని కాలేకపోయారు. తొలిసారిగా సనై తకైచి ఈ పదవిని చేపట్టనున్నారు.
ఈ శనివారం...
సరిగ్గా నేపాల్ సంక్షోభం జరిగిన సెప్టెంబరు మొదటి వారంలోనే జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు షిగెరు ఇషిబా. జపాన్ లో ప్రస్తుతం లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ) అధికారంలో ఉంది. ఈ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నవారే ప్రధాని అవుతారు. తకైచి ఎల్డీపీ చీఫ్ గా ఎన్నికవడంతో ప్రధాని పదవిలో కూడా కూర్చోనున్నారు.
-జపాన్ లో పార్లమెంటు ఎగువ సభ ఎన్నికల్లో ఎల్డీపీ మెజారిటీ సాధించలేకపోయింది. దిగువ సభలో అంతకుముందే మెజారిటీ కోల్పోయింది. ఇషిబా రాజీనామా చేయాల్సి వచ్చింది. శనివారం పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. షింజిరో కోయిజిమితో ప్రధానంగా తలపడిన తకైచి విజయం సాధించారు.
-44 ఏళ్ల కోయిజుమి మాజీ ప్రధాని కుమారుడు. ఇక 64 ఏళ్ల తకైచి... 1993లో నారా నుంచి ఎంపీగా గెలిచారు. ఎల్డీపీ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు చేపట్టారు. వీటిలో లింగ సమానత్వ శాఖ మంత్రిత్వ బాధ్యతలూ ఉండడం గమనార్హం.
