అక్కడ తాగి సైకిల్ తొక్కితే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్!
ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది జనవరి – సెప్టెంబర్ మధ్య సస్పెండ్ చేసిన కారు డ్రైవింగ్ లైసెన్స్ ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే చాలా పెరిగిందని తెలిపారు.
By: Raja Ch | 28 Dec 2025 6:00 AM ISTమన దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత పెద్ద వ్యవహారం అనేది తెలిసిందే. ఈ కేసులో దొరికితే కొన్ని ప్రాంతాల్లో జరిమానా, మరికొన్ని ప్రాంతాల్లో జరిమానా ప్లస్ జైలు కాగా.. ఇంకొన్ని చోట్ల వీటితో పాటు రహదారులపై 'డొంట్ డ్రంక్ అండ్ డ్రైవ్" అనే ఫ్లకార్డులు పట్టుకుని నిల్చోవాల్సిన పరిస్థితి! అయితే.. తాగి టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ లు నడపడమే కాదు.. తాగి సైకిల్ తొక్కినా నేరంగా భావిస్తూ.. వారి బైక్, కారు డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు!
అవును... మద్యం తాగి సైకిళ్లు నడుపుతూ దొరికిన సుమారు 900 మంది కారు డ్రైవింగ్ లైసెన్స్ లను జపాన్ పోలీసులు సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... "కారు నడిపేటప్పుడు కూడా ఇలాగే చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంది" అని భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ లో సైక్లిస్టులకు కఠినమైన జరిమానాలు విధించే కొత్త ట్రాఫిక్ చట్టాలు తెచ్చిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది జనవరి – సెప్టెంబర్ మధ్య సస్పెండ్ చేసిన కారు డ్రైవింగ్ లైసెన్స్ ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే చాలా పెరిగిందని తెలిపారు. 2024 నవంబర్ లో ప్రారంభమైన కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం... మద్య తాగి సైకిల్ తొక్కే ఎవరికైనా 5,00,000 యెన్లు (సుమారు రూ.2.86 లక్షలు) వరకూ జరిమానా లేదా/మరియు మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని అధికారులు వెల్లడించారు!
ఈ క్రమంలో 2024 నవంబర్ లో కొత్త రూల్స్ వచ్చిన తర్వాత 2025 జూన్ వరకూ జపాన్ లో సుమారు 4,500 మందికి పైగా మద్యం తాగి సైకిల్ తొక్కుతూ పట్టుబడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత జపాన్ ప్రజలు సైకిళ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో 2023లో జపాన్ లో 72 వేలకు పైగా సైకిల్ ప్రమాదాలు నమోదయ్యాయని.. ఇందులో ఎక్కువ శాతం మద్యం సేవించి సైకిల్ తొక్కడం వల్లే జరిగాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రూల్స్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మరింత కఠినతరం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఒక చేత్తో గొడుగు పట్టుకుని సైకిల్ తొక్కడం.. బైక్ పై ఫొన్ లను ఉపయోగించడం.. ట్రాఫిక్ లైట్లను విస్మరించడంతో పాటు రాత్రిపూట సైకిల్ కు లైట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు కూడా జరిమానా విధించనున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. దీంతో.. ట్రాఫిక్స్ రూల్స్ విషయంలో జపాన్ రూల్స్ పీక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. చాలామంది వీటిని స్వాగతిస్తున్నారు!
