Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో ఆక్సిజన్ కోసమని రూ.6 లక్షలు కొట్టేశాడు

డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. తాజాగా జపాన్‌లో వెలుగుచూసిన ఒక సంఘటన ప్రజలను షాక్‌కు గురి చేసింది.

By:  A.N.Kumar   |   6 Sept 2025 8:30 AM IST
అంతరిక్షంలో ఆక్సిజన్ కోసమని రూ.6 లక్షలు కొట్టేశాడు
X

డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. తాజాగా జపాన్‌లో వెలుగుచూసిన ఒక సంఘటన ప్రజలను షాక్‌కు గురి చేసింది. తాను అంతరిక్షంలో ఇరుక్కుపోయిన ఒక ఆస్ట్రోనాట్ అని చెప్పుకుంటూ ఒక సైబర్ నేరగాడు జపాన్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేశాడు. ఆక్సిజన్ కోసం డబ్బు కావాలని చెప్పి ఆమె నుండి ఏకంగా 6 లక్షల రూపాయలు (సుమారు 5 వేల పౌండ్లు) కొట్టేశాడు.

* మోసం జరిగిన విధానం

ఈ మోసం గత జులైలో మొదలైంది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి తాను అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసే ఆస్ట్రోనాట్ అని వృద్ధురాలిని నమ్మించాడు. కొన్ని వారాల పాటు ఆమెతో మాట్లాడుతూ ఆమె ఒంటరితనాన్ని, ఆప్యాయత కోసం ఆమెకున్న కోరికను ఉపయోగించుకుని ఆమెను పూర్తిగా తన మాటల్లోకి దించాడు. ఆమెకు అతనంటే ఇష్టం పెంచుకునేలా చేసి, ఇది ఒక రొమాన్స్ స్కామ్ గా మార్చాడు. ఆ తరువాత ఒక రోజు నాటకీయంగా తనను తాను ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పుకున్నాడు. "నేను ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నాను. నా స్పేస్ షిప్ పై దాడి జరిగింది, ఇక్కడ ఆక్సిజన్ కొరతగా ఉంది. భూమికి తిరిగి రావాలంటే అత్యవసరంగా డబ్బు కావాలి" అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అతని మాటలు నమ్మిన ఆ వృద్ధురాలు, తను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి తన పొదుపులో నుంచి రూ.6 లక్షలు అతని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది.

* మోసగాడి మాయం, పోలీసుల దర్యాప్తు

డబ్బు అందిన వెంటనే ఆ "ఆస్ట్రోనాట్" వృద్ధురాలితో సంప్రదింపులను పూర్తిగా నిలిపివేశాడు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం మానేశాడు. దీంతో తను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధులు, ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ రొమాన్స్ స్కామ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

* సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

సైబర్ క్రైమ్ నిపుణులు ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదు. వారి నిజ జీవిత వివరాలను ధ్రువీకరించుకోకుండా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి అత్యవసరంగా డబ్బు కావాలని అడిగితే అది మోసమే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలియని ఖాతాలకు డబ్బు పంపకూడదు. అనుమానాస్పదంగా అనిపించిన వ్యక్తులను వెంటనే పోలీసులకు లేదా సంబంధిత సైబర్ క్రైమ్ విభాగానికి నివేదించాలి.

అంతరిక్ష పరిశోధనలు పురోగమిస్తున్న ఈ కాలంలో "అంతరిక్షం" పేరుతోనే ఇలాంటి మోసాలు జరగడం ఆశ్చర్యకరంగా మారింది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.