Begin typing your search above and press return to search.

జెన్-జీ ఉద్యమాల వేడి.. జంతర్ మంతర్‌ నిరసనలకు చెక్! కేంద్రం కీలక నిర్ణయం

దీంతో సుప్రీం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు చేసిన ఉద్యమం వల్లే ఈ పిటిషన్ దాఖలు కాగా, దీని వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉండొచ్చని పరిశీలకులు అనుమానిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   4 Aug 2026 11:28 AM IST
జెన్-జీ ఉద్యమాల వేడి.. జంతర్ మంతర్‌ నిరసనలకు చెక్! కేంద్రం కీలక నిర్ణయం
X

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో, ప్రజా ఉద్యమాల్లో ఎంతో కీలకమైన, చారిత్రక ప్రాధాన్యం గల ప్రాంతం జంతర్ మంతర్. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ స్ట్రీట్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా జరిగే నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు ఇది ప్రధాన వేదికగా నిలుస్తూ వచ్చింది. ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి, ప్రజా సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడానికి ఇదొక అధికారిక నిరసన స్థావరంగా మారింది. అయితే, తాజాగా జరిగిన పరిణామాలతో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు బ్రేక్ వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో సుప్రీం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు చేసిన ఉద్యమం వల్లే ఈ పిటిషన్ దాఖలు కాగా, దీని వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉండొచ్చని పరిశీలకులు అనుమానిస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతించకూడదంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ దేశ రాజకీయాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్ ద్వారా జంతర్ మంతర్‌లో నిరసనలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ వద్ద తరచూ జరిగే ధర్నాలు, ఆందోళనల కారణంగా స్థానికులకు తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆరోపిస్తూ సతీష్ చంద్ కౌశిక్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రధానన్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

పిటిషనర్ లేవనెత్తిన అంశాలు అత్యంత కీలకమైనవని, ఈ సమస్యకు పరిష్కారంగా స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ వేదికను గుర్తించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు కథనాలు వస్తున్నాయి. దీనిపై తగిన సూచనలతో రావాలని సోలిసిటర్ జనరల్‌ను ఆదేశిస్తూ సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో కేంద్రం కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనలకు చెక్ పెట్టే విధంగా అడుగులు వేయొచ్చని పరిశీలకులు అనుమానిస్తున్నారు.

ఈ పరిణామానికి ప్రధాన తక్షణ ప్రేరణగా ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువజన ఆందోళనలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో యువత కదం తొక్కింది. ముఖ్యంగా, 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జెన్-జీ (Gen Z) యువత చేపట్టిన పోరాటం జంతర్ మంతర్‌ను కేంద్రంగా చేసుకుని ఉప్పెనలా ఎగిసిందని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి గతంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్యను తిరగరాస్తూ, యువత తమ నిరసనలో 'మేమూ కాక్రోచ్‌లే' అంటూ వినూత్న రీతిలో సోషల్ మీడియా వేదికగా ఉద్యమించారు. జంతర్ మంతర్ వేదికగా సుదీర్ఘ కాలం పాటు ఆందోళనలు నిర్వహించిన ఈ యువత, 'సంసద్ చలో'కి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలు, లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి.

పార్లమెంట్, రాష్ట్రపతి భవన్‌కు అతి సమీపంలో ఉండటం వల్ల, పెద్ద ఎత్తున నిరసనకారులు గుమిగూడినప్పుడు భద్రతా పరమైన సవాళ్లు తీవ్రమవుతున్నాయి. నిత్యం జరిగే ఆందోళనల వల్ల ట్రాఫిక్ నిలిచిపోవడం, అత్యవసర అంబులెన్సులు, వైద్య సేవలు నిలిచిపోవడం, వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలగడం వల్ల స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనదే అయినప్పటికీ, అది జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా నగర శివార్లలోని ప్రత్యేక ప్రత్యామ్నాయ వేదికలలో నిర్వహించాలని సూచిస్తున్నారు. అయితే పార్లమెంటు స్ట్రీటులో ఉన్న ధర్నా వేదిక దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుండటం వల్లే వేదికను మరోచోటకు తరలించాలని కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

జంతర్ మంతర్ వద్ద నిరసనలను నియంత్రించి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ సానుకూల స్పందన రాబోయే రోజుల్లో దేశ రాజకీయ నిరసనల రూపురేఖలను పూర్తిగా మార్చేయనుందని అంటున్నారు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ, జెన్-జీ యువత చేపట్టిన ఉద్ధృత పోరాటాలు, పార్లమెంట్ ముట్టడి యత్నాలు ఈ నిర్ణయ వేగాన్ని మరింత పెంచాయి. ఒకవేళ కేంద్రం కనుక కఠినమైన ప్రత్యామ్నాయ వేదికను ఖరారు చేస్తే, దశాబ్దాలుగా ఢిల్లీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న జంతర్ మంతర్ చరిత్ర మరుగైపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.