Begin typing your search above and press return to search.

రాజీనామాతో టీడీపీకి షాక్.. జంగాకు చంద్రబాబు ఫోన్.. పల్నాడులో పొలిటికల్ హీట్

టీడీపీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి టీడీపీ రాజకీయాల్లో హీట్ పుట్టించారు.

By:  Tupaki Political Desk   |   10 Jan 2026 12:00 PM IST
రాజీనామాతో టీడీపీకి షాక్.. జంగాకు చంద్రబాబు ఫోన్.. పల్నాడులో పొలిటికల్ హీట్
X

టీడీపీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి టీడీపీ రాజకీయాల్లో హీట్ పుట్టించారు. గత ఎన్నికలకు ముందు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుతో కలిసి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి కూటమి ప్రభుత్వంలో టీటీడీ సభ్యుడిగా నియమితులయ్యారు. రాజకీయంగా ఏడాదిన్నగా అంతా సజావుగా ఉందన్న సమయంలో ఆయన ఆకస్మికంగా తన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి కారణం ఆయనకు చెందిన ట్రస్టుకు భూ కేటాయింపులను తప్పుబడుతూ సీఎం చంద్రబాబు కేబినెట్ లో చేసిన వ్యాఖ్యలే అంటున్నారు.

రెండు రోజులుగా ఓ పత్రికలో కథనాలు రావడం, వాటి ఆధారంగా కేబినెట్ లో సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జంగా కృష్ణమూర్తికి భూములు కేటాయించలేమని చెప్పడంపై ఆయన మనస్తాపం చెందినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కలకలం రేపారు. ఈ పరిణామాలతో పల్నాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తికి ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

టీటీడీ సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. గత ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విజయానికి పనిచేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా, 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గురజాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో టీటీడీ సభ్యుడిగా నియమితులయ్యారు.

తొలిసారి టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు తిరుమల కొండపై భూమి కేటాయించినట్లు చెబుతున్నారు. అయితే అప్పట్లో ఆయన ఆ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయలేదు. ఇక 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా, టీటీడీ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ సమయంలో తిరుమల క్షేత్రంలో తన భూమిలో భవన నిర్మాణాలకు ప్రయత్నించారు. ఇందుకోసం టీటీడీకి కొంత మొత్తం డిపాజిట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడంతో అప్పటి ప్రభుత్వం జంగాకు కేటాయించిన భూములను రద్దు చేసినట్లు ఆయన స్వయంగా చెప్పారు.

తనకు రెండు దశాబ్దాల క్రితం కేటాయించిన భూములు తిరిగి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే, బోర్డు సభ్యుల్లో బీజేపీకి చెందిన భానుప్రకాష్ రెడ్డి తప్పించి మిగిలిన అంతా మద్దతు తెలిపారని, అనుకూలంగా తీర్మానం చేశారని జంగా కృష్ణమూర్తి చెబుతున్నారు. బోర్డు ఆమోదించిన తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా భూములు కేటాయించడాన్ని సీఎం తప్పు పట్టడాన్ని కృష్ణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలనే ఆలోచనతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

దీంతోనే రాజీనామా చేస్తున్నట్లు కృష్ణమూర్తి ప్రకటించడం టీడీపీలో చర్చకు దారితీసిందని అంటున్నారు. సీనియర్ నాయకుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన నేత ఇలా వైదొలగడం తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పార్టీలో చర్చ జరుగుతోందని చెబుతున్నారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జంగాతో మాట్లాడి వ్యవహారాన్ని చక్కదిద్దడానికి పూనుకున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సీఎం ఏం మాట్లాడారు? దానికి కృష్ణమూర్తి ఏం చెప్పారన్నది ఇంకా తెలియాల్సివుంది. సీఎం మాట్లాడిన తర్వాత కృష్ణమూర్తి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. లేనిపక్షంలో పరిస్థితులు మరింత జటిలమయ్యే సూచనలు ఉన్నాయంటున్నారు.