తెలంగాణా ఫోకస్ : మున్సిపల్ పోరులో జనసేన
ఇక తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను రద్దు చేసి అడహాక్ కమిటీలను ఆయన నియమించారు. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ కి కూడా అడహాక్ కమిటీలను ఏర్పాటు చేశారు.
By: Satya P | 11 Jan 2026 4:38 AM ISTజనసేన తన రాజకీయ ప్రయాణాన్ని ప్రస్థానాన్ని మరింతగా విస్తరించుకుంటోంది. ఏపీలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న క్రమంలో మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణాలోనూ తన రాజకీయాన్ని చాటాలని చూస్తోంది. ఈ నెల 3న కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం జరిగిన తెలంగాణా జనసేన క్యాడర్ నాయకుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా తనకు ఎంతో చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణా వారు మంచి వారు అన్నారు. తనకు తెలంగాణా అంటే ప్రత్యేక ఇష్టమని చెప్పారు.
అడహాక్ కమిటీలతో :
ఇక తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను రద్దు చేసి అడహాక్ కమిటీలను ఆయన నియమించారు. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ కి కూడా అడహాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీరంతా జనాల్లో ఉండి పనిచేయాలని ఆదేశించారు. ఇక లేటెస్ట్ గా చూస్తే తెలంగాణా మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పోటీకి సిద్ధపడుతోంది అని అంటున్నారు. తెలంగాణాలో బలమైన సామాజిక వర్గం అండ జనసేనకు ఉంది. దాంతో పాటు యువత పవన్ ని అభిమానించే వారు అంతా పెద్ద సంఖ్యలో ఉన్నారని అంటున్నారు.
యాక్షన్ ప్లాన్ రెడీ :
ఈ నేపధ్యంలో జనసేన ఒక యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతోంది అని అంటున్నారు. ఇక తెలంగాణాలో జనసేన పార్టీని బలోపేతం కోసం అడహాక్ కమిటీలను వేసిన జనసేన పార్టీని జనంలోకి తీసుకుని వెళ్ళాలని క్యాడర్ ని కోరింది. అంతే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలకు సిద్ధంగా పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరింది. అంతే కాదు ప్రచారానికి కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలని కోరింది.
ఫిబ్రవరిలో ఎన్నికలు :
ఇక తెలంగాణాలో ఫిబ్రవరిలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ తో పాటు విపక్షంలోని బీఆర్ఎస్ అలాగే బీజేపీ సిద్ధం అవుతున్నాయి. పట్టణాలలో ఎన్నికలు అంటే తమకు సహజంగా ఎడ్జ్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఇక జనసేన కూడా పోటీకి సిద్ధం కావడంతో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఏమైనా ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ అయితే మునిసిపల్ ఎన్నికలలో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. వామపక్షాలు మజ్లీస్ పార్టీలు కూడా ఈ ఎన్నికల మీద ఆశలు పెంచుకున్నాయి. మొత్తంగా చూస్తే అనేక పార్టీలు రేసులో ఉంటున్న వేళ తెలంగాణా మునిసిపల్ ఎన్నికలు ఆసక్తిని పెంచుతున్నాయి. జనసేన ఈసారి పోటీకి సిద్ధం కావడం కూడా ఈ ఆసక్తిని ఇంకా పెంచుతోంది అని చెప్పాల్సి ఉంది.
