విజయవాడ మేయర్ పీఠంపై జనసేన కర్చీఫ్.. టీడీపీలో తర్జనభర్జన
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై జనసేన పార్టీ ఫోకస్ చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Gallery Desk | 28 July 2026 11:00 PM ISTరాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై జనసేన పార్టీ ఫోకస్ చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే విజయవాడ కార్పొరేషన్ పై జనసేన జెండా ఎగరేసేలా ఆ పార్టీ పక్కా వ్యూహరచన చేస్తోందని అంటున్నారు. ఈ నెల 24న నగరంలో నిర్వహించిన పార్టీ సమావేశం ప్రధాన అజెండా కూడా ఇదేనంటున్నారు. నగరంలోని అన్ని డివిజన్ల నేతలతో ఆ రోజు సమావేశమైన జనసేన అగ్ర నేతలు నగరంలో పార్టీ ప్రాబల్యంపై ఎక్కువగా చర్చించారని చెబుతున్నారు. విజయవాడ నగరంపై పట్టు సాధిస్తే ఆ ప్రభావం చుట్టుపక్కల రెండు మూడు జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి విజయవాడను తమ ఖాతాలో వేసుకునేలా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు.
సెప్టెంబరులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతుండగా, కూటమి పార్టీల నేతలు తమకు అనుకూలమైన స్థానాలపై ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. పొత్తు కారణంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేయనుండటంతో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే సస్పెన్స్ నెలకొంది. పొత్తుల కారణంగా టీడీపీ 85 శాతం స్థానాల్లో పోటీ చేస్తుందని, 15 శాతం స్థానాల్లో జనసేన, 5 శాతం స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ గతంలో ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన తమకు బలం ఉన్న స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది.
ఇదే సమయంలో తమకు ఆసక్తి ఉన్న స్థానాలపై మిత్రపక్షాలకు సంకేతాలు పంపుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో పెద్ద నగరాలు అయిన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి కార్పొరేషన్ మేయర్ స్థానాలను కూడా పొత్తు ధర్మం ప్రకారం కేటాయించాలని జనసేన కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా తమకు బలం ఉన్న విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కొన్ని మేయర్ పదవులను జనసేన ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖలో తొలి నుంచి టీడీపీకి గట్టి పట్టు ఉన్నందున ఆ స్థానాన్ని వదులుకుని దానికి ప్రతిగా విజయవాడ నగరాన్ని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ దిశగా టీడీపీతో ముందుగానే చర్చించాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు జనసేన పార్టీ మేయర్ స్థానాన్ని ఆశిస్తుందనే సమాచారం టీడీపీ నేతలను కలవరానికి గురిచేస్తోందని చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉండగా, తమ వారసులను రంగంలోకి దింపాలని, కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని కొంత మంది టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఊహించని విధంగా జనసేన ముందుగా రంగంలోకి దిగి కర్చీఫ్ వేయడంతో పసుపు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఈ విషయంలో జనసేన ముందుగానే పావులు కదుపుతుండటం వల్ల ఎక్కడ తమ పార్టీ అధిష్టానం అంగీకరిస్తుందోనని టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు.
