Begin typing your search above and press return to search.

వైసీపీ కంచుకోట మీద జనసేన సీరియస్ ఫోకస్

వైసీపీకి 2024 ఎన్నికలు అత్యంత చేదు ఫలితాలు ఇచ్చాయి. ఇంతటి విపత్కర పరిస్థితులలోనూ 11 సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది.

By:  Satya P   |   30 Jun 2026 5:00 AM IST
వైసీపీ కంచుకోట మీద జనసేన సీరియస్ ఫోకస్
X

వైసీపీకి 2024 ఎన్నికలు అత్యంత చేదు ఫలితాలు ఇచ్చాయి. ఇంతటి విపత్కర పరిస్థితులలోనూ 11 సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. ఇవి వైసీపీకి చెక్కు చెదరని కంచుకోటల కిందనే లెక్క అని చెబుతారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో చూసుకుంటే మొత్తం మూడు ఉమ్మడి జిల్లాలలో కలుపుకుని 34 అసెంబ్లీ అయిదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2014లో వైసీపీ గెలుచుకున్నది తొమ్మిది అసెంబ్లీ ఒక పార్లమెంట్. అందులో అరకు ఉంది. అలాగే అరకు పాడేరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019లో చూస్తే టీడీపీకి ఆరు సీట్లు తప్ప మొత్తం 28 అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అలాగే శ్రీకాకుళం ఎంపీ తప్ప అన్ని ఎంపీలను గెలుచుకుంది. అందులో కూడా అరకు ఎంపీ ఉంది. 2024 లో అయితే ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి దక్కాయి. ఆ విధంగా ఉత్తరాంధ్రలో వైసీపీ పరువు నిలిపింది ఎక్కడ అంటే మళ్లీ అరకునే చెప్పుకోవాలి. అలా అరకు ఎంపీ రెండు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ పరం అయ్యాయి. ఇపుడు ఆ సీట్ల మీదనే జనసేన ఫోకస్ పెడుతోంది.

టీడీపీ వల్ల కానిది :

వైసీపీ ఆర్విర్భవించి 2014 నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఆరంభించాక అరకు సీట్లు అన్నీ ఆ పార్టీకే దఖలు పడుతూ వస్తున్నాయి. టీడీపీ దీనిని బ్రేక్ చేయాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ ఆ పార్టీ వల్ల కాలేదు. వైసీపీ నుంచి బలమైన నేతలను తీసుకుని వచ్చి పోటీకి పెట్టినా ఫ్లితాలలో మార్పు రాలేదు. అంతే కాదు మూడు ఎన్నికలు పార్లమెంట్ కి జరిగితే మూడు సార్లూ ముగ్గురు మహిళా అభ్యర్ధులను పోటీ చేయించి వైసీపీ సక్సెస్ కొట్టిది. అలా ప్రస్తుతం తనూజా రాణి అరకు ఎంపీగా ఉన్నారు. ఆమెకు ముందు గొడ్డేటి మాధవి ఉంటే 2014లో అరకు ఎంపీగా వైసీపీ నుంచి కొత్తపల్లి గీత గెలిచారు. ఆ విధంగా అరకు అయితే వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అన్నది రుజువు అయింది.

జనసేన సీరియస్ గానే :

అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో ముఖ్య భాగంగా ఉన్న జనసేన ఉత్తరాంధ్రాలో ఎక్కువగా ఎస్టీ సీట్ల మీదనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ సీటులో జనసేన బోణీ కొట్టింది. అదే ఊపులో రానున్న రోజులలో అరకు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మొత్తం పోటీ చేయాలని చూస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సార్లు పాడేరు అరకులలో పర్యటించారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అదే విధంగా ఆయన గిరిజన ప్రాంతాలలో పంచాయతీ రాజ్ నిధుల నుంచి రహదారులను వేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

స్పష్టం చేసిన నాగబాబు :

ఇదిలా ఉంటే అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడిగా నియమితులు అయిన నాగబాబు తాజాగా మాట్లాడుతూ అరకు ప్రాంతంలోని మొత్తం సీట్లకు వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వారి సంక్షేమానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అరకు ఎంపీ పరిధిలో అన్ని సీట్లకు పోటీ చేసేందుకు జనసేన భారీ యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతోంది అని ఆయన చెప్పారు. దీంతో అరకు విషయంలో ఇపుడు సరికొత్త రాజకీయ చర్చకు తెర లేచినట్లు అయింది.

ఏడు అసెంబ్లీ సీట్లు :

ఇదిలా ఉంటే అరకు ఎస్టీ లోక్‌సభ నియోజకవర్గంలో సరిగ్గా ఏడు శాసనసభ (సీట్లు ఉన్నాయి.అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే కనుక పాలకొండ (ఎస్టీ) కురుపాం,(ఎస్టీ)), పార్వతీపురం (ఎస్సీ), సాలూరు (ఎస్టీ), అరకు లోయ (ఎస్టీ)) పాడేరు (ఎస్టీ) రంపచోడవరం (ఎస్టీ) గా ఉన్నాయి. ఇందులో అరకు పాడేరు తప్పించి మిగిలినవి అన్నీ టీడీపీ కూటమి చేతిలో ఉన్నాయి. అంటే అయిదు అసెంబ్లీ సీట్లలో కూటమి హవాయే ఉంది. ఇందులో టీడీపీకి నాలుగు ఉన్నాయి. మరి అన్ని సీట్లకు జనసేన పోటీ చేస్తుందని నాగబాబు ప్రకటించడంతో టీడీపీ సంగతేంటని చర్చ కూడా ఉంది. అయితే కూటమి పార్టీలు సర్దుబాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీ సహా మొత్తం సీట్లను కొల్లగొట్టేందుకు సిద్ధపడతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.