నెల్లూరులో జనసేన నేతపై దాడి.. అసలు విషయం ఏంటంటే..
జనసేన ప్రధాన కార్యదర్శి, ఏపీ మైక్రో స్మాల్ అండ్, మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పై దాడి జరిగిందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
By: Tupaki Political Desk | 21 Oct 2026 1:11 PM ISTజనసేన ప్రధాన కార్యదర్శి, ఏపీ మైక్రో స్మాల్ అండ్, మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పై దాడి జరిగిందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒక వీడియో ద్వారా శివశంకర్ స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ లో డివిజన్ల సర్దుబాటుపై చర్చిస్తున్న సమయంలో జనసేన నేత శివశంకర్ పై సొంత పార్టీ కార్యకర్తలు దాడి చేశారని విస్తృత ప్రచారం జరిగింది. దీంతో కూటమి కార్యకర్తల్లో కలకలం చెలరేగింది. దీంతో శివశంకర్ స్వయంగా వీడియో విడుదల చేశారు.
తనపై దాడి జరిగిందనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ క్లారిటీ ఇచ్చారు. నెల్లూరులో తనపైన మరికొందరు నాయకులపైన వీర మహిళ ఒకరు దాడి చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు నెల్లూరులో సీట్ల సర్దుబాటుపై తాను చర్చిస్తున్నానని, అయితే కూటమిలో చిచ్చు రాజేసేందుకు కొందరు కావాలని తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని వెల్లడించారు.
నెల్లూరు నగరంలో కూటమి సర్దుబాట్ల విషయంలో జనసేన కార్యకర్తలు కొందరు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఒక మహిళా నాయకురాలు కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారని, అయితే సర్దుబాట్ల వల్ల ఆమెకు అవకాశం లేకపోవడంతో పార్టీ నేత శివశంకర్ ను నిలదీసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ఘటనను సాకుగా చూపుతూ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారానికి తెర తీశారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో అసంతృప్తికి గురైన మహిళను రెచ్చగొట్టడానికి కూడా వైసీపీ నేతలే ప్రయత్నాలు చేశారని విమర్శలు చేస్తున్నారు.
మొత్తానికి ఈ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసింది. నెల్లూరులో కూటమి తరఫున టీడీపీ నేత రూప్ కుమార్ మేయరుగా పోటీ చేస్తున్నారు. ఈ నగర పాలక సంస్థ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 58 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 30 శాతం అంటే దాదాపు 20 డివిజన్లు తమకు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించిందని చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం జనసేన బలం ప్రకారం 8 నుంచి 10 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు అసంతృప్తికి లోనై పార్టీ సమన్వయ సంఘం సభ్యుడు శివశంకర్ పై దాడి చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై శివశంకర్ స్వయంగా వివరణ ఇవ్వడంతో ఆ ప్రచారం ఉట్టిదేనని స్పష్టమైందని అంటున్నారు.
