తమిళనాడులోకి జనసేన ఎంట్రీ.. పవన్ సిగ్నల్స్ ఇవేనా?
దీంతోతమిళనాడులో జనసేన ఎంట్రీ ఇచ్చే అవకాశంఉందన్న ప్రచారం జనసేన వర్గాల్లో జోరుగా సాగుతోం ది.
By: Garuda Media | 1 Sept 2025 12:22 AM ISTఏపీలో అధికారం పంచుకున్న జనసేన పార్టీ తమిళనాడులోకి కూడా ఎంట్రీ ఇవ్వనుందా?.. జాతీయ పార్టీగా అవతరించడానికి ముందే.. తమిళనాడులో అడుగు పెట్టనుందా? అంటే..ఔననే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో శనివారం ముగిసిన `సేనతో సేనాని` కార్యక్రమం అనంతరం.. పవన్ కల్యాణ్.. తమిళనాడులో.. తాజాగా కొత్త పార్టీ పెట్టిన ప్రముఖ హీరో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కండువాను మెడలో వేసుకున్నారు. అదేసమయంలో ఆ పార్టీ జెండాను చేత పట్టుకుని నినాదాలు ఇచ్చారు.
దీంతోతమిళనాడులో జనసేన ఎంట్రీ ఇచ్చే అవకాశంఉందన్న ప్రచారం జనసేన వర్గాల్లో జోరుగా సాగుతోం ది. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీవీకే పార్టీ దూకుడు పెంచింది. ఇటీవల మధురైలో నిర్వహించిన సమావేశానికి పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని.. విజయ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన ప్రధాన పార్టీలైన.. డీఎంకే, అన్నాడీ ఎంకే, బీజేపీలతో తమకు పొత్తు ఉండదని చెప్పారు.
అయితే.. భావసారూప్యత, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ఉండే.. ఇతర పార్టీలతో కలిసి ప్రజల కోసం ఉద్యమిస్తామని విజయ్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగానే ఆయన సీఎం స్టాలిన్‌ను అంకుల్-అంకుల్ అంటూ.. సంబోధించిన విషయం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఈ క్రమంలో విజయ్ పార్టీపై విమర్శలు కూడా ఉన్నాయి. టీవీకే(తమిళ వెట్రి కగళం) పార్టీ బీజేపీకి బీ పార్టీ అనే ప్రచారం ఉంది. ఉద్దేశ పూర్వకంగానే విజయ్ పార్టీ పెట్టారని.. ఆయనకు సినిమాలపై నే ఎక్కువగా ఫోకస్ ఉందని కూడా ప్రచారం ఉంది.
కానీ, వచ్చే ఎన్నికల్లో డీఎంకే తటస్థ ఓటు బ్యాంకుతోపాటు.. ఆ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చి.. బీజేపీకి మేలు చేయాలన్న ఉద్దేశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా జనసేన అధినేత తమ పార్టీని జాతీయస్థాయిలో విస్తరించాలని భావిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. దీనికితోడు టీవీకే కండువా, జెండా కూడా పట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వంటివి ఆసక్తిగా మారాయి. ఇదే నిజమైతే.. పవన్ కల్యాణ్ తమిళనాట ఎంట్రీ ఖాయమని అంటున్నారు. తమిళనాడులో మెగా అభిమానులు ఉండడం.. పవన్ కల్యాణ్ వెళ్లిన పలు సభలకు కూడా మంచి రెస్పాన్స్‌రావడంతో ఆయన ఎంట్రీ కాయమని తెలుస్తోంది. అయితే.. ఆయన ఇండివిడ్యువల్‌గానే పోటీ చేస్తారా? లేక, టీవీకేతో పొత్తు పెట్టుకుని అడుగులు వేస్తారా? అనేది చూడాలి.
