జనసేనలోకి వెళ్తే కోల్డ్ స్టోరేజ్ ?
రాజకీయాల్లో ఎవరైనా ఎదగాలని అనుకుంటారు. ఆ ఎదుగుదలలో భాగంగానే పార్టీలు మారుతూ ఉంటారు.
By: Satya P | 5 Dec 2025 10:21 PM ISTరాజకీయాల్లో ఎవరైనా ఎదగాలని అనుకుంటారు. ఆ ఎదుగుదలలో భాగంగానే పార్టీలు మారుతూ ఉంటారు. ఇలా వైసీపీ నుంచి చాలా మంది నేతలు ఆ పార్టీ ఏపీలో అధికారంలో నుంచి పోగానే వెంటనే జంప్ చేశారు. అలా సీనియర్ నేతల నుంచి అనేక మంది కూటమి పార్టీలలో చేరిపోయారు. జనసేనలో చేరిన వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారు కూడా ఉన్నారు. ఒక విధంగా తమ జిల్లాలలో రాజకీయ చక్రం తిప్పిన వారు కూడా ఉన్నారు. అయితే ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో పెద్ద పదవులు చేసిన వారు కూడా జనసేనలోకి వెళ్ళాక అంతే గౌరవం హోదాలను ఆశించారు. కానీ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే వారు అనుకున్నది వేరే అయింది అని అంతర్మధనం చెందుతున్నారని ప్రచారం అయితే సాగుతోంది.
లిస్ట్ ఇదే :
వైసీపీలో ఒకనాడు ప్రకాశం జిల్లా లాంటి చోట తన పలుకుబడితో అన్ని శాసించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ ఓటమి చెందాక జనసేనలోకి వెళ్ళారు. ఇపుడు ఆయన తగిన ప్రాధాన్యత లేదంటూ వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు సామినేని ఉదయభాను పరిస్థితి కూడా అలాగే ఉంది అని అంటున్నారు. ఆయనను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా చేసినా తనకు పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత లేదని ఆవేదన చెందుతున్నారని అంటున్నారు.
దొరలా ఉన్నా కూడా :
ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సాధించుకున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలోకి వచ్చాక తన ప్లేస్ ఏంటో అర్ధం కాక ఉన్నారని అంటున్నారు. నియోజకవర్గంలో ఫైవ్ మెన్ కమిటీని పార్టీ నియమించింది. అందులో పెండెం దొరబాబు ఒకరుగా మాత్రమే ఉన్నారని అంటున్నారు. ఇక పొన్నూరులో 2019 లో వైసీపీ తరఫున గెలిచిన కిలారు రోశయ్య జనసేనలో చేరినా ఆయనకు పొన్నూరు జనసేన ఇంచార్జి గా పదవి కూడా దక్కలేదని అంటున్నారు.
స్పెషల్ కేటగిరీగా :
తాము రాజకీయంగా ఎంతో సీనియర్లమని, తాము పదవులు చేసి వచ్చిన వారిమని వీరంతా భావించి జనసేనలోకి వెళ్లారు, కానీ అక్కడ ప్రత్యేక ప్రాధాన్యతలు ఏవీ లేకపోగా పవన్ కళ్యాణ్ సైతం అసలు పెద్దగా పట్టించుకోవడం లేదని మధనపడుతున్నారని అంటున్నారు. దీంతో తాము ఎందుకు పార్టీ మారామని కూడా వీరు తమలో తామే ప్రశ్నించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు.
వైసీపీలోకి తిరిగి :
ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలోకి తిరిగి వెళ్లాలని అనుకున్నా కూడా అదంతా ఈజీగా అయ్యేది కాదని అంటున్నారు. వైసీపీలో అధినాయకత్వం తీరు దానికి కారణం. ఒకసారి పార్టీ వీడిపోతే మళ్ళీ అక్కడ డోర్స్ అయితే తెరచుకోవు అని అంటున్నారు. మరో వైపు చేర్చుకున్నా అవకాశాలు అయితే దక్కేది ఉండదని అంటున్నారు. ఇక ఆత్మ గౌరవం అసలు సమస్య అని చెబుతున్నారు. తాముగా పార్టీని వీడి తిరిగి చేరితే అది తమకే ఇబ్బందిగా ఉంటుందని కూడా కలవరం చెందుతున్నారు అని అంటున్నారు.
వారికి నో ఆప్షన్స్ :
మొత్తానికి చూస్తే ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్నట్లుగా వీరి రాజకీయం తయారు అయింది అని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో లాంగ్ జంప్స్ చేసినా ఒక్కోసారి అవి సక్సెస్ కావు, పైగా కాళ్ళు కూడా విరగవచ్చు అని అంటున్నారు. అన్ని ఫిరాయింపులు ఇంపుగా ఉండవని సూపర్ హిట్ కావని వీరి గురించి ఆలోచిస్తే కనుక అర్థం అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఏపీలో చూస్తే రాజకీయం కూటమి వర్సెస్ వైసీపీగా ఫిక్స్ అయిన వేళ ఇలాంటి వారికి నో ఆప్షన్స్ అని అంటున్నారు. ఈ విషయం గుర్తెరిగిన చాలా మంది ఉన్న చోటనే సైలెంట్ గా ఉంటున్నారు అని కూడా గుర్తు చేస్తున్నారు. మరి ఏపీ రాజకీయాల్లో ఇదే సీన్ మును ముందు కనిపిస్తుందా లేక ఏమైనా మార్పులు ఉంటాయా అంటే చూడాల్సిందే.
