'సేనతో సేనాని'.. మార్పుకోరుతున్న సేనలు.. !
'సేనతో సేనాని' పేరుతో జనసేన ఈనెల 28వ తారీకు నుంచి విశాఖపట్నంలో మూడు రోజులు పాటు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసింది.
By: Garuda Media | 25 Aug 2025 8:00 PM IST'సేనతో సేనాని' పేరుతో జనసేన ఈనెల 28వ తారీకు నుంచి విశాఖపట్నంలో మూడు రోజులు పాటు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ముఖ్యంగా రెండు కీలక అజెండాలను పెట్టుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నారు.
అయితే ఈ అజండాతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు కొంత మార్పును కోరుకుంటున్నారు. దానిపై కూడా చర్చించాలనేది వారు కోరుతున్న డిమాండ్. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పనులు చేస్తున్నప్పటికీ తమకు గుర్తింపు రావడం లేదు అనేది జనసేనలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. ప్రధానంగా డామినేషన్ రాజకీయాలు జరుగుతున్నాయి అన్నది జనసేన నేతలు చెబుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న నియోజకవర్గంలో కూడా డామినేట్ చేస్తున్నారని, ప్రచారం నుంచి పనుల వరకు అన్ని వారే చేయించుకుంటున్నారనేది జనసేనలో అంతర్గతంగా సాగుతున్న చర్చ.
ఇదే సమయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ అధికారంలోకి తీసుకురావడంలను కీలక పాత్ర పోషించిన జనసేనకు దక్కాల్సిన విధంగా గౌరవం దక్కడం లేదన్నది వారి ఆవేదన. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం మనకు రావలసిన దానికన్నా ఎక్కువగానే గౌరవం లభిస్తోందని అంతర్గతంగా చెబుతున్నారు. ఈ రెండు అంశాల మధ్య నాయకులు తల్లడిల్లుతున్నారు. అయితే, దీనిని సున్నితంగా తీసుకోవాలని, ప్రతి విషయంలోనూ పట్టుదలతో వ్యవహరిస్తే సరికాదు అన్నది జనసేన అధినేత చెబుతున్న మాట.
కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం దీనిపైన చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కోరుతున్నారు. సామాజిక వర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత దూకుడుగా వ్యవహరించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నది కార్యకర్తలు సూచిస్తున్న మాట. దీనికి ఏ మేరకు ఈ వేదిక ఉపయోగపడుతుంది భవిష్యత్తు నిర్ణయాలకు ఏ మేరకు దోహదపడుతుందని చూడాలి. ఎన్నికల నాటికి పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసుకుంటే సొంతంగానే అధికారంలోకి రావాలన్నది కొందరు చెబుతున్న మాట. కానీ. కూటమితోనే 15 సంవత్సరాల పాటు ఉంటామని జనసేన అధినేత చెబుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందా లేక ఈ వేదిక కేవలం పొగడ్తలకు పరామర్శలకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాలి. మరో కీలక అంశం... వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యేల తీరును ఈ వేదిక ద్వారా సరిచేయాలనేది కూడా నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ఒకరిద్దరు నాయకుల కారణంగా జనసేన పార్టీ ఇటీవల కాలంలో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వరకు ఒకరిద్దరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తలనొప్పులు తీసుకొస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని, దారి తప్పుతున్న నేతలను గాడిన పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
