Begin typing your search above and press return to search.

కూటమి ప్రభుత్వ నిర్ణయాలలో జనసేన ప్రభావమెంత ?

ఇక మంత్రి వర్గ సమావేశాలు జరిగినపుడు మంత్రులు అంతా తప్పనిసరిగా హాజరవుతారు. ఒకవేళ వారు రాలేకపోతే ముందుగా ముఖ్యమంత్రి అనుమతి తీసుకుంటారు.

By:  Satya P   |   24 July 2026 12:00 AM IST
కూటమి ప్రభుత్వ నిర్ణయాలలో జనసేన ప్రభావమెంత ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరి పాతిక నెలలు కావస్తోంది. ఈ మధ్యలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. వాటిని అమలులో కూడా పెడుతూ వస్తోంది. ఇక అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త పధకాలను ప్రాజెక్టులను కార్యక్రమాలను పట్టలెక్కిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఠంచనుగా ప్రతీ నెలా రెండు సార్లు వంతున కేబినెట్ మీటింగులు నిర్వహిస్తూ వస్తున్నారు. అలా ఇప్పటికి దాదాపుగా యాభై దాకా మంత్రి వర్గ సమావేశాలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగాయి. వీటిలో చాలా వరకూ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ హాజరైనా అదే సమయంలో అనేక మంత్రివర్గ సమావేశాలలో ఆయన పాల్గొనలేకపోయిన సందర్భాలు కూడా ఉండడం విశేషం.

ప్రభుత్వంలో అతి ముఖ్యంగా :

ఇక కూటమి ప్రభుత్వంలో నంబర్ పరంగా చూస్తే జనసేన పాత్ర తక్కువ కావచ్చేమో కానీ కూటమి కట్టడంలో కానీ ప్రభుత్వ ఏర్పాటులో కానీ జనసేనను రాజకీయంగా ఎంతో కీలకంగా అంతా భావిస్తారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణంగా రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రికి అధికారిక ముద్ర లేకపోయినప్పటికీ రాజకీయంగా ప్రోటోకాల్ పరంగా కూడా పవన్ కి విశేష ప్రాధాన్యత అయితే దక్కుతోంది. ముఖ్యమంత్రితో సమానంగా ఆయన ఫోటోలు అన్ని ప్రభుత్వ ఆఫీసులలో ఉంచారు. అదే విధంగా చూస్తే కనుక ప్రభుత్వం కార్యక్రమాలలో సైతం అదే తీరున గౌరవం దక్కుతోంది. ఒక విధంగా ప్రభుత్వంలో నంబర్ టూ అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది.

కేబినెట్ లోనే చర్చలుగా :

ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా కేబినెట్ లోనే ముందుగా చర్చకు వస్తుంది. అక్కడ మంత్రులు అంతా దాని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఆమోదించాక అది ప్రభుత్వం అమలు చేసేందుకు ముందుకు వెళ్తుంది. మరి ఎంతో ప్రాముఖ్యత కలిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ హజరైన సందర్భాలలో ప్రభుత్వ నిర్ణయాల విషయంలో జనసేన ప్రభావం ఏ మేరకు చూపించగలిగారు అన్నది కూడా చర్చగా ఉంది. కూటమిలో మిత్రులు అయినా జనసేన అజెండా కూడా దానికి ఉంది. అంతే కాదు ఎన్నికల సమయంలో జనసేన మ్యానిఫేస్టోని రిలీజ్ చేసింది. ఆ విధంగా ఆ పార్టీ కూడా ప్రభుత్వంలో తమ వంతుగా నిర్ణయాలను అమలు జరిగేలా ప్రభావవంతమైన పాత్ర ఏ మేరకు పోషించింది అన్నది కూడా ఉండనే ఉంది.

అరుదైన సందర్భంగానే :

ఇక మంత్రి వర్గ సమావేశాలు జరిగినపుడు మంత్రులు అంతా తప్పనిసరిగా హాజరవుతారు. ఒకవేళ వారు రాలేకపోతే ముందుగా ముఖ్యమంత్రి అనుమతి తీసుకుంటారు. అలాగని అత్యధికసార్లు గైర్ హాజరు అయినా అది ఇబ్బంది అవుతుంది. అలా ఎవరూ చేసిన సందర్భాలు కానీ దాఖలాలు కానీ దేశంలో కూడా ఎక్కడా లేవు. అయితే ఏపీ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్ హాజరు మాత్రం అరుదైన సందర్భంగానే చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎక్కువ సార్లు గైర్ హాజరు అయ్యారని అంటున్నారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ అనారోగ్య సమస్యలలతో సతమతం అవుతున్నారు కాబట్టి రాలేదు అని అనుకున్నా ఆయన గతంలో సమావేశానికి వచ్చి మధ్యలో ఆరోగ్య ఇబ్బందుల వల్ల కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. తాజాగా చూస్తే గురువారం మంత్రివర్గ సమావేశానికి కూడా పవన్ హాజరు కాలేదు. ఆయన మంగళగిరి క్యాంప్ ఆఫీసు నుంచే తన విధులను నిర్వహిస్తున్నారు. మరో పదిహేను రోజులలో జరిగే మంత్రివర్గ సమావేశానికి బహుశా పవన్ హాజరు కావచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్ణయాలలో కీలక పాత్ర జనసేన పోషిస్తుందని అంతా భావిస్తున్నారు.