Begin typing your search above and press return to search.

జనసేనకు బలం ఉంది కానీ...?

ఏపీలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం ఉంది. మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

By:  Satya P   |   24 Sept 2026 6:00 PM IST
జనసేనకు బలం ఉంది కానీ...?
X

ఏపీలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం ఉంది. మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందులో టీడీపీ సంస్థాగతంగా అత్యంత పటిష్టంగా ఉంది. దాని వయసు కూడా నాలుగున్నర పదులు దాటింది. వైసీపీ పార్టీ వయసు పదిహేనేళ్ళు పై దాటింది. దానికి కూడా సంస్థాగతంగా బలం బాగానే ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే అత్యంత గ్లామర్ ఇమేజ్ కలిగిన పవన్ కళ్యాణ్ అధినాయకుడిగా ఉన్నారు. అయితే జనసేనకు సంస్థాగతంగా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. జనసేనకు ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నా సంస్థాగతంగా పటిష్టంగా ఉండడం చలా అవసరం అని అంటున్నారు.

స్థానిక ఎన్నికలు అంటేనే :

నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే సంస్థాగతమైన బలా బలాల ఆధారంగానే జరుగుతాయి. ఇక్కడ పార్టీలు అధినేతల ఇమేజ్ ల కంటే కూడా స్థానికంగా ఉండే వ్యక్తులు వారి బలాలే కీలకంగా ఉంటాయి. అలా చూసుకున్నపుడు గ్రౌండ్ లెవెల్ లో బలంగా ఉన్న పార్టీలకే ఎడ్జ్ ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ అన్ని విధాలుగా ముందు వరసలో ఉంది. ఇక టీడీపీని బూత్ లెవెల్ దాకా ఢీ కొట్టే విషయంలో వైసీపీ పోటీ పడుతోంది. ఆ పార్టీకి కూడా కొన్ని చోట్ల సంస్థాగతమైన సమస్యలు ఉన్నప్పటికీ టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడానికే చూస్తోంది. జనసేన విషయం అయితే అలా లేదని అంటున్నారు.

లిట్మస్ టెస్ట్ గానే :

ఇక స్థానిక ఎన్నికల్లో జనసేన కనుక ఒకవేళ ఫ్రెండ్లీ కంటెస్ట్ అని పోటీకి దిగితే మాత్రం అది ఒక లిట్మస్ టెస్ట్ గా ఆ పార్టీకి ఉంటుందని అంటున్నారు. అదేల అంటే బలం ఉన్న చోట ఆ పార్టీ పోటీ పడాలని చూస్తోంది. ఎంత బలం ఉన్నా బూత్ లెవెల్ దాకా దానిని తీసుకుని పోయి ఓటు వేయించేదే సంస్థాగతమైన బలం. అదే అసలైనది. మరి జనసేనకు ఆ క్యాడర్ క్షేత్ర స్థాయిలో అట్టడుగు వరకూ ఉన్నారా అన్నది కూడా ఈ ఎన్నికలు నిరూపించబోతున్నాయని అంటున్నారు. కూటమితో పొత్తులతో వెళ్తే కనుక జనసేనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే టీడీపీ అన్ని చోట్లా ఉంది. మిత్ర ధర్మంతో కచ్చితంగా సహకారం ఉంటుంది. కానీ విడిగా దిగితేనే సొంత పోరు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

పటిష్టమైన నిర్మాణంతోనే :

ఏ రాజకీయ పార్టీకి అయినా పటిష్టమైన నిర్మాణం గ్రౌండ్ లెవెల్ నుంచి ఉండాలి. నాయకుడికి ఎంత ఇమేజ్ ఉన్నా కూడా ప్రతీ బూత్ లెవెల్ లో కనీసంగా ఉండే వేయి మంది జనాభాకు పార్టీ గురించి చెప్పగలిగే యాభై మంది దాకా అయినా పార్టీ జనం ఉండాలి. అలా బూత్ లెవెల్ నుంచి కమిటీలను జనసేన వేసి అక్కడ నుంచి రాష్ట్ర స్థాయి దాకా అంచెలంచెల వ్యవస్థను నిర్మాణం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఈ విషయంలో అయితే జనసేన ఇటీవల కాలంలో దృష్టి పెట్టిందని చెబుతున్నారు. మొత్తం బూత్ లెవెల్ నుంచి జిల్లా రాష్ట్ర నాయకత్వాల దాకా కమిటీలను వేయాలని సమర్ధులకు అవకాశం కల్పించాలని పవన్ ఆలోచించారు. అయితే ఈలోగా ఆయనకు కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తడంతో అవి వెనక్కి వెళ్లాయి. నిజానికి స్వాతంత్ర్య దినోత్సవం వేడుకకు ప్రతీ బూత్ లెవెల్ లోనూ జనసేన పార్టీ విభాగం ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం జనసేన సహా ప్రతీ పార్టీకి ఒక మంచి అవకాశంగా చూస్తున్నారు. మరి ఇందులో రాణించిన పార్టీలకే మరింతగా భవిష్యత్తు ఉంటుందని విశ్లేషిస్తున్నారు.