Begin typing your search above and press return to search.

అసలు ఏమిటీ జనసేన ఎమ్మెల్యే (అక్రమ సంబంధం) వ్యవహారం!

ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఈ సందర్భంగా.. తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు.

By:  Raja Ch   |   28 Jan 2026 9:47 AM IST
అసలు ఏమిటీ జనసేన ఎమ్మెల్యే (అక్రమ సంబంధం) వ్యవహారం!
X

ఆంధ్రప్రదేశ్ లో పలువురు రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మరుతున్న సంగతి తెలిసిందే. ప్రజాసేవ కోసం అని పార్టీ కండువాలు కప్పుకుని.. అధికారం ముసుగులో అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన జనసేన నాయకుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్రాతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది!

అవును... ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన నాయకుడి లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నివేదికల ప్రకారం.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫేస్‌ బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగినితో అతడు సోషల్ మీడియా యాప్ లో చాట్ చేస్తూ.. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని సదరు మహిళ ఆరోపిస్తున్నారు.

ఈ కాలంలో తనకు ఐదుసార్లు అబార్షన్ అయ్యిందని.. ఇదంతా అతను ప్లాన్ ప్రకారం చేశారని.. తన కుటుంబాన్ని ప్లాన్ ప్రకారమే తనకు దూరం చేసినట్లు అనిపిస్తుందని.. ప్రతీ రోజూ తన ఇంటికి వచ్చి బలవంతంగా తనతో లైంగిక చర్య కొనసాగిస్తున్నారని.. మాట వినకపోతే కొడుతున్నారని.. ఈ విషయంలో కుటుంబ సభ్యులతో తనకు పూర్తిగా విభేదాలు వచ్చేశాయని ఆమె తెలిపింది. ఈ క్రమంలో... ఇటీవల వివాహం చేసుకోనని అతను చెప్పడంతో మరో మార్గంలేక మీడియాను సంప్రదించినట్లు ఆమె చెబుతున్నారు!

అతడు ఇంటికి వచ్చినప్పుడు.. తాను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడే ఉండేవారని.. అంతేకాకుండా నా భర్త, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్‌ నెంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేశారని.. నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్‌ చేసి బెదిరించారని.. దీంతో అందరూ నా నుంచి దూరమైపోయారని.. మాట వినక పోతే నీ కుమారుడికి ఏమైనా అయితే నన్ను అడగొద్దని బెదిరిస్తున్నారని.. ఈ క్రమంలో నా బిడ్డ కూడా గత ఆరు నెలలుగా నాతో ఉండటం లేదని ఆమె తెలిపారు.

ఈ విధంగా... నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని ఆమె ఆరోపిస్తున్నారు. సుమారు ఏడాదిన్నరగా వేధించి, వాడుకుని ఇప్పుడు వదిలేస్తానంటున్నారని ఆమె చెబుతున్నారు. ఇదే క్రమంలో... ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా వీడియో కాల్‌ చేయాలనేవారని.. నగ్నంగా చూడాలనేవారని.. నాతోనే కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలా మంది మహిళలను వేధించారని.. ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని ఆమె కోరుతున్నారు! దీనికి సంబంధించిన వీడియోలు, చాటింగ్ టెక్స్ట్ లను ఆమె బయట పెట్టారు!

విరుచుకుపడిన విపక్షం!:

జనసేన పార్టీ ఎమ్మెల్యే, విప్ అరవ శ్రీధర్ పై ఈ స్థాయిలో ఓ మహిళ వాట్స్ అప్ చాట్ లు, వీడియో కాల్స్ రికార్డింగ్ లు చూపిస్తూ ఆరోపణలు చేయడంతో.. వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ స్థాయిలో అధికారపార్టీలోని ఎమ్మెల్యే బరితెగించడాన్ని.. మహిళల భద్రత, చట్టపరమైన పాలన యొక్క గుండేను తాకిన నేరమే అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ పై తక్షణ అరెస్టు, స్వతంత్ర దర్యాప్తు జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ మహిళా నేతలు, మాజీ మంత్రులు... ఆర్కే రోజా, విడదల రజనీ, పుష్ప శ్రీ వాణి, వరుదు కల్యాణి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో భాగంగా... ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ఈ తరహా మౌనం ఏమాత్రం సమర్థనీయం కాదని అంటున్నారు!

స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్!:

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ.. బాధితురాలితో ఫోన్‌ లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా... మహిళ గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఆమె స్పష్టం చేశారు. ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామని తెలిపారు.

ఎమ్మెల్యే వెర్షన్ ఇది!:

ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఈ సందర్భంగా.. తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చా లేదని.. తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదని చెబుతూ.. తననే 6నెలలుగా వేధింపులకు గురిచేశారని అన్నారు. ఈ క్రమంలో.. తనను వేధించిన విషయంలో నా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా... కావాలని డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తనపై దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పిన ఎమ్మెల్యే... తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తానని చెప్పుకొచ్చారు!

స్పందించిన ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ!:

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ స్పందిస్తూ... తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు అత్యంత అమాయకుడని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయంపైనా ఆమె స్పష్టత ఇచ్చారు.

ఇందులో భాగంగా.. ఆమె తమ ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుండేదని.. అయితే, ఈ చనువును ఆసరాగా చేసుకుని సాయం పేరుతో ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యేను వేధిస్తోందని.. అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్లు చేసి, ఇంటికి వచ్చి టార్చర్ పెట్టేదని.. దీనివల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె ఆరోపించారు. దీనిపై తాము గతంలోనే రైల్వేకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రమీలమ్మ వెల్లడించారు.