జనసేన వాళ్ళకు తొక్కేస్తున్నారు...ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ !
అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన 60 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందని కూడా చెప్పారు. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న చోట సీట్లు తీసుకుంటుంది అని కూడా ఆయన అన్నారు.
By: Satya P | 12 Sept 2026 7:49 AM ISTజనసేనలో ఆ ఎమ్మెల్యే వరసబెట్టి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఆయనే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆయన ఇటీవల అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పవన్ అలాగే కాపులు లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలలో రాజకీయమే లేదని ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన 60 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందని కూడా చెప్పారు. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న చోట సీట్లు తీసుకుంటుంది అని కూడా ఆయన అన్నారు. అంతటితో ఆయన ఆగడం లేదు, ఆ హాట్ కామెంట్స్ ప్రకంపనలను అలాగే కొనసాగిస్తున్నారు.
మా వాళ్ళను తొక్కేస్తున్నారు :
ఇక లేటెస్ట్ గా ఆయన ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలలో జనసేన వాళ్లను తొక్కుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. తాము అయితే జనసేన గెలిచిన చోట టీడీపీ వాళ్లను గౌరవిస్తున్నామని చెప్పారు. టీడీపీవాళ్లతో కలిసి భోజనం చేస్తున్నామని కూడా గుర్తు చేశారు. కానీ టీడీపీలో మాత్రం అలా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కడం విశేషం. పైగా రెండు పార్టీల మధ్య తేడాను ఆయన ఎత్తి చూపిస్తున్నారు.జనసేన పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో మేము మిత్రపక్షమైన టీడీపీ నేతలను కార్యకర్తలను గౌరవిస్తున్నాం కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల మాత్రం జనసేన వాళ్లను పూర్తిగా అణగదొక్కుతున్నారు అని బొలిశెట్టి చేసిన ఈ ప్రకటన రాజకీయంగా దుమారమే రేపుతోంది.
పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు :
అంతటితో కూడా బొలిశెట్టి ఆగలేదు, ఈ విషయాలు అన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు అని మరో ప్రకటన చేశారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న ఈ రకమైన సమస్యలపైన చంద్రబాబుతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారని బొలిశెట్టి చెప్పడం విశేషం. అంతే కాదు ప్రస్తుతం రెండున్నరేళ్లు కాలంలో కార్యకర్తల బాధను చూశామని ఇకపై మీరు బాధపడకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. అదే విధంగా భవిష్యత్తులో జనసేన బలం మరింత పుంజుకుంటుందని బొలిశెట్టి ధీమాగా చెప్పారు.
కూటమి ఎమ్మెల్యేగా ఉంటూ :
సరే కూటమిలో పార్టీలు అన్న తరువాత అనేక రకాల సమస్యలు ఉంటాయి. కానీ కూటమిలో కలిసి చర్చించి సర్దుకోవాల్సి ఉంది కదా అని అంటున్నారు. కానీ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలసి ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో ఒక ఎమ్మెల్యే అది కూడా తన సొంత కూటమి ప్రభుత్వం మీదనే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్తా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దీని మీద జనసేన వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్నది చూడాల్సి ఉంది. అలాగే టీడీపీ వారు కూడా ఎలా రియాక్ట్ అవుతారో మరి. ఏది ఏమైనా బొలిశెట్టి అయితే హాట్ కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు.
