Begin typing your search above and press return to search.

పాపం శ్రీధ‌ర్‌.. ప‌వ‌న్ కోసం వెయిటింగ్‌.. !

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాకు చెందిన రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వహారం.. ఇటు సొంత పార్టీలోను... అటు ఇత‌ర రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

By:  Garuda Media   |   13 Feb 2026 1:35 PM IST
పాపం శ్రీధ‌ర్‌.. ప‌వ‌న్ కోసం వెయిటింగ్‌.. !
X

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాకు చెందిన రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వహారం.. ఇటు సొంత పార్టీలోను... అటు ఇత‌ర రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాల‌కు ఆయ‌న హాజ‌రు కావ‌డం లేదు. బ‌డ్జెట్ స‌మావేశాలు బుధ‌వారం నుంచి ప్రారంభం అయ్యాయి. తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం, రెండో రోజు గురువారం నుంచి ధ‌న్య‌వాదాల తీర్మానంపై ర‌చ్చ జ‌రిగింది.

ఈ స‌మ‌యంలో అర‌వ శ్రీధ‌ర్ స‌భ‌లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పోనీ.. ఆయ‌నేమ‌న్నా సొంత నియోజ‌క‌వ‌ర్గం లోనే ఉన్నారా? అంటే.. అదీ లేదు. విజ‌య‌వాడ‌లోనే మ‌కాం వేశారు. అయినా.. కూడా శ్రీధ‌ర్ మాత్రం స‌భ వైపు క‌నిపించ‌లేదు. దీంతో పార్టీనే ఆయ‌న‌ను స‌భ‌కు రావొద్ద‌ని ఆదేశించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుతం లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారాన్ని తేల్చేందుకు జ‌న‌సేన స్వ‌యంగా త్రిస‌భ్య క‌మిటీని నియ‌మించిన విష‌యం తెలిసిందే.

ఈ క‌మిటీ విచార‌ణ‌ను కొన‌సాగిస్తోంది. అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు క‌మిటీ తెలిపింది. మ‌రోవైపు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ సూచ‌న‌ల మేర‌కు.. శ్రీధ‌ర్‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి. ఈ రెండు ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీధ‌ర్ స‌భ‌కు రాకుండా ఉండ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. దీనిపైనే జ‌న‌సే న స‌భ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్‌ స్పందించారు. పార్టీ ప‌రంగా ఆయ‌న‌ను వ‌ద్ద‌లేద‌ని.. కానీ, ఆయ‌నే మౌనంగా ఉండిపోయార‌ని చెప్పారు.

ఈ స‌మ‌యంలో కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేశారు. వైసీపీకి ఈ విష‌యంతో సంబంధం లేద‌ని.. అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం.. ఓ మ‌హిళ‌కు-వ్య‌క్తిగ‌తంగా శ్రీధ‌ర్‌కు సంబంధించిన వ్య‌వ‌హార‌మ‌ని.. దీనిలో పార్టీ ప్ర‌మేయం అంటూ ఏమీ లేద‌న్నారు. వాస్త‌వానికి ఆరోప‌ణ‌లు చేస్తున్న మ‌హిళ కూడా.. ఇది పూర్తిగా వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. శ్రీధ‌ర్ అసెంబ్లీకి రాకుండా.. విజ‌య‌వాడ‌లో మ‌కాం వేశారు. దీని వెనుక‌.. ఆయ‌న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపుకోసం వేచిచూస్తున్నార‌న్న వాద‌నా వినిపిస్తోంది. మొత్తానికి గ‌త రెండు రోజులుగా అయితే.. శ్రీధ‌ర్ విజ‌య‌వాడ‌లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.