Begin typing your search above and press return to search.

పవన్ ఛాన్స్ తీసుకోవాల్సిందేనా ?

పైగా టీడీపీ నూరు శాతం సీట్లలో పోటీ చేయగల సత్తా ఉన్న పార్టీ. దాంతో ఆ పార్టీలో దీని మీద ఏ మేరకు అంగీకారం కుదురుతుంది అన్నదే కీలక పాయింట్.

By:  Satya P   |   16 Sept 2026 7:41 AM IST
పవన్ ఛాన్స్ తీసుకోవాల్సిందేనా ?
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక ఛాన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా చూస్తే జనసేన అధినాయకత్వానికి ఇపుడు కీలక నిర్ణయం తీసుకోవడం రాజకీయ అనివార్యతగా మారుతోంది. ఒక వైపు పార్టీని నమ్ముకుని దశాబ్దం పైగా పనిచేస్తున్న కార్యకర్తలు ఒక వైపు ఉన్నారు. మరోవైపు తాను కూటమి కట్టి నిలబెట్టిన రాజకీయ వేదిక ఉంది. దీంతో పవన్ ఇపుడు చాలా సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే జనసేన మిత్ర పక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన డిమాండ్ సాధించుకోవాల్సి ఉంది. ఎందుకంటే పార్టీయే ఎవరికైనా ముఖ్యం. కార్యకర్తల అభీష్టంతోనే పార్టీలు నడుస్తాయి. వారే జీవగర్రగా ఏ పార్టీకైనా ఉంటారు. అధినేత సుప్రీం అయినా కార్యకర్తలు సైతం ఆ నిర్ణయాలను విశేషంగా ప్రభావితం చేస్తూంటారు.

న్యాయమైన డిమాండ్ గానే :

విషయానికి వస్తే జనసేన కోరింది ముప్పయి శాతం సీట్లు. అది న్యాయమైన డిమాండ్ గానే చూస్తున్నారు. జనసేనకు కోరిన విధంగా సీట్ల పంపిణీ చేసినా పెద్ద పార్టీ అయిన టీడీపీకి 70 శాతం ఉంటుంది. అందులో బీజేపీకి 10 శాతం ఇచ్చినా అరవై శాతం సీట్లలో పోటీ చేయవచ్చు. ఇది కూటమిలో మిత్ర ధర్మానికి కూడా సంకేతంగా ఉంటుంది. అదే కనుక జరిగితే కూటమి మరింత పటిష్టం అవుతుంది. అంతా కలిసి ఐక్యంగా పనిచేస్తారు. ఏపీలో ఉన్న మొత్తం సీట్లను వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలుచుకుంటారు అని అంటున్నారు. అయితే ఈ విషయం పైకి చెప్పినట్లుగా సింపుల్ గా కనిపిస్తున్నా అన్ని పార్టీలకీ క్యాడర్ తోనే సమస్య. పైగా టీడీపీ నూరు శాతం సీట్లలో పోటీ చేయగల సత్తా ఉన్న పార్టీ. దాంతో ఆ పార్టీలో దీని మీద ఏ మేరకు అంగీకారం కుదురుతుంది అన్నదే కీలక పాయింట్.

అయిననూ కోరాల్సిందే :

అయితే టీడీపీ విషయంలో తమ్ముళ్ల ఆకాంక్షలు ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది పక్కన పెడితే జనసేన 2024లో కొన్ని త్యాగాలు చేసింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు కచ్చితంగా సీట్లు అడిగి తీసుకోవాల్సిందే అని అంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కచ్చితంగా వాటా సాధించాల్సిందే అని అంటున్నారు. గతంలో మాదిరిగా మొహమాటాలకు పోతే అది జనసేనకు ఇబ్బందికరంగా మారుతుంది అని అంటున్నారు. దాని కంటే మించి జనసేన సంస్థాగతంగా మరింతగా బలపడాలి అంటే సరైన పునాది ఇపుడే పడాలని అంటున్నారు.

సర్దుబాటలోనే :

కూటమిలో ఐక్యతను కాపాడుకుంటూనే సర్దుబాటలో పయనించాలి అంటే మధ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. అయితే ఇపుడు అలాంటివి కుదిరే వ్యవహారం ఉందా అన్నది మరో చర్చ. ఎందుకంటే ముప్పై శాతం సీట్లు తమకు కావాలని జనసేన బాహాటంగా ఒకసారి చెప్పిన తరువాత వెనక్కి వెళ్తే అది క్యాడర్ లో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు. అందువల్ల కూటమి పెద్దలతో సర్దుబాటు వేళ ఎలాంటి దిద్దుబాట్లు లేకుండా అనుకున్న సీట్లను సాధించుకుని వస్తే కచ్చితంగా జనసేన మరింత స్ట్రాంగ్ గా నిలిచిపోతుంది అని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి జనసేన బలంగా మారి ఆ పార్టీకి మంచి భవిష్యత్తుని కూడా ఇస్తుంది అని అంటున్నారు. దాంతో పవన్ చాన్స్ తీసుకోవాల్సిందే అన్నదే గట్టిగా వినిపిస్తోంది.