Begin typing your search above and press return to search.

దువ్వాడని టార్గెట్ చేసిన జనసేన

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా మెలిగిన వారు దువ్వాడ శ్రీనివాస్.

By:  Satya P   |   4 Aug 2025 9:38 AM IST
దువ్వాడని టార్గెట్ చేసిన జనసేన
X

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా మెలిగిన వారు దువ్వాడ శ్రీనివాస్. ఆయన వైసీపీలో జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగారు అందుకే ఆయనకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అంతే కాదు ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ గౌరవించారు. అయితే తన వ్యక్తిగత వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఆయన తెగ వైరల్ కావడంతో పార్టీ ఇబ్బందులో పడింది. దాంతో ఆయనని చాలా కాలం క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

కూటమికి దగ్గరగా :

అయితే జగన్ తనకు దేవుడు అని ఒకనాడు అన్న దువ్వాడ శ్రీనివాస్ ఇపుడు తన గొంతు సవరించుకున్నారు. తాను వైసీపీలో ఎంతో చేసినా ఇపుడు పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కూటమికి చేరువ కావడానికి చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను తెగ పొగుడుతున్నారు. వారి గురించి మెచ్చుకోలు కబుర్లు చెబుతున్నారు. ఆ విధంగా ఆయన వీలు అయితే టీడీపీ లేదా జనసేనలోకి చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న ప్రచారం అయితే సాగుతూ వస్తొంది.

వదలమంటున్న జనసేన :

అయితే వైసీపీలో ఉన్నపుడు తన వాచాలత్వంలో దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నపుడే కాదు ఓడిన తరువాత కూడా ఆయన పవన్ మీద గట్టిగానే మాట్లాడారు. ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన హాట్ కామెంట్స్ చేశారు ముడుపులు తీసుకునే ఈ విధంగా మౌనం వహిస్తున్నారా అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశాయి. ఇవి జనసైనికులకు ఆగ్రహం తెప్పించాయి. దాంతో తాజాగా జనసేన నాయకుడు ఒకరు దువ్వాడ శ్రీనివాస్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నమోదు అయిన కేసు :

ఇదిలా ఉంటే హీర మండలానికి చెందిన జనసేన నాయకుడు ఒకరు పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్ మీద స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు తమ నాయకుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కేసుని నమోదు చేసిన హీరమండలం పోలీసులు టెక్కలి వెళ్ళి మరీ దువ్వాడ శ్రీనివాస్ కి నోటీసులు అందించారు. దాంతో ఏమి జరుగుతుంది అన్న చర్చ మొదలైంది.

అరెస్టు తప్పదా :

దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయాలని చాలా కాలంగా టీడీపీ జనసేన నాయకులు కోరుతూ వస్తున్నారు. అయితే ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ అయి రాజకీయంగా ఏ పార్టీలో లేకపోవడంతో పాటు కూటమికి అనుకూలంగా మాట్లాడడంతో కొంతకాలంగా ఆయన మీద అరెస్టు వార్తలు అయితే వినిపించడం లేదు. అయితే ఇపుడు అనూహ్యంగా కేసు నమోదు కావడం దువ్వాడ ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు అందచేయడంతో అరెస్టు తప్పదా అన్న చర్చ వస్తోంది. టెక్కలిలో అయితే కింజరాపు ఫ్యామిలీతో దువ్వాడకు వైరం ఉంది. అలాగే జనసేన స్థానిక నాయకులు అంతా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఆయన కూటమి పట్ల ఎంత సానుకూలంగా ఉన్నా అరెస్టు అయి తీరుతారని వారు అంటున్నారు. మరి దువ్వాడ రాజకీయ వ్యూహం ఏమిటో చూడాల్సి ఉంది.