Begin typing your search above and press return to search.

జనసేన గాజు గ్లాస్ కి ఎఫెక్ట్...ఈసీ కీలక నిర్ణయం

ఏపీలో స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. వీరిలో రెబెల్స్ అధికంగా కనిపిస్తున్నారు.

By:  Satya P   |   21 Oct 2026 7:29 PM IST
జనసేన గాజు గ్లాస్ కి ఎఫెక్ట్...ఈసీ కీలక నిర్ణయం
X

ఏపీలో స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. వీరిలో రెబెల్స్ అధికంగా కనిపిస్తున్నారు. పార్టీల నుంచి బీ ఫారాలు రాకపోయినా జనం మద్దతుతో పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్న వారు ఉన్నారు. అలాగే పొత్తులలో సీట్లు గల్లంతు అయిన వారు రిజర్వేషన్ల మూలంగా తమ సీట్లు దక్కని వారు కూడా ఏదో విధంగా పోటీ పడాలనుకుంటున్నారు. దాంతో ఈసారి స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు చాలా పెద్దవి తయారు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అలాగే ఎక్కడ లేని గుర్తులు తెచ్చి ఇండిపెండెంట్లకు కేటాయించాల్సి వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా కసరత్తు చేస్తూంటే జనసేన పార్టీ కొన్ని గుర్తుల మీద టెన్షన్ పడుతోంది అని అంటున్నారు.

ఆ రెండు గుర్తులతో :

జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 21కి 21 సీట్లు గెలిచి ఆరు శాతం కంటే ఎక్కువగా ఓటు షేర్ తెచ్చుకోవడంతో ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దాంతో జనసేన స్థానిక సంస్థల ఎన్నికలలో అదే గుర్తుతో రంగంలో ఉంది. అయితే జనసేన గాజు గ్లాస్ గుర్తుని పోలిన రెండు గుర్తులు ఉన్నాయని అంటున్నారు. అవే ఇపుడు ఆ పార్టీకి కలవరం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. ఆ రెండు గుర్తులు బకెట్, పెన్ స్టాండ్ గుర్తులుగా అంటున్నారు. ఈ గుర్తులు కనుక ఉంటే జనసేన గాజు గ్లాస్ అనుకుని ఓటర్లు గందరగోళంలో పడతారు అని జనసేన వర్గాలు అంటున్నాయి. అందుకే ఈ రెండు గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించకుండా చూడాలని ఎస్ ఈసీని జనసేన విజ్ఞప్తి చేసింది. ఈ రెండు గుర్తులూ జనసేన గాజు గ్లాస్ గుర్తుని పోలి ఉన్నాయని ఎన్నికల సంఘం దృష్టికి జనసేన తీసుకుని వచ్చింది.

ఆ గుర్తుల మీదనే :

జనసేన చేసిన విన్నపం మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం బకెట్, పెన్ స్టాండ్ గుర్తులను ఎన్నికల గుర్తు జాబితా నుంచి తాత్కాలికంగా నిషేధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ అధికారులు అంతా ఈ ఉత్తర్వులను అనుసరించి ఈ గుర్తులను పక్కన పెట్టాలని ఎస్ ఈసీ స్పష్టం చేసింది. ఎవరికీ ఈ గుర్తులు కేటాయించవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో జనసేన వర్గాలు ఊరట చెందడమే కాకుండా ఎస్ ఈసీ నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గాజు గ్లాస్ గుర్తు మీద మొదటి సారి స్థానిక ఎన్నికలలో జనసేన పోటీ చేస్తోంది. దాంతో పాటు కూటమి నుంచి ఎక్కువ సీట్లనే పొత్తులో భాగంగా సాధించుకుంది. ఈ ఎన్నికల్లో సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాలని చూస్తోంది. అందులే ఎలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఏ చిన్న పాటి ఇబ్బందులు లేకుండా ఆ పార్టీ నాయకులు అయితే అలెర్ట్ అవుతున్నారు. దాంతో గాజు గ్లాస్ ని ఎఫెక్ట్ చేసే రెండు గుర్తులను సక్సెస్ ఫుల్ గా పక్కన పెట్టించగలిగారు అని అంటున్నారు.