Begin typing your search above and press return to search.

బొలిశెట్టితో మాకు సంబంధం లేదు: జ‌న‌సేన‌

ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన ఘాటుగా స్పందించింది.

By:  Garuda Media   |   25 March 2026 3:20 PM IST
బొలిశెట్టితో మాకు సంబంధం లేదు:  జ‌న‌సేన‌
X

జ‌న‌సేన పార్టీకి కొన్నాళ్లు విరామం ప్ర‌క‌టించాన‌ని.. అయితే.. అనుబంధం తెంచుకోలేద‌ని గ‌త రెండు మాసాల కింద‌ట ప్ర‌క‌టించిన సీనియ‌ర్ నేత‌.. విశ్లేష‌కుడు.. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన ఘాటుగా స్పందించింది. ఆయ‌న‌తో పార్టీకి.. పార్టీ అధినేత‌కు ఎలాంటి సంబంధం.. అనుబంధం లేద‌ని ప్ర‌క‌టించింది. బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ వ్య‌క్తిగ‌త సిద్ధాంతాల‌ను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నార‌ని తెలిపింది.

ఈ క్ర‌మంలో పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బొలిశెట్టికి ఎప్పుడో అనుమ‌తి ఇచ్చార‌ని.. వ్య‌క్తిగ‌త అజెండాలు పెట్టుకునే వారు స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నార‌ని గుర్తు చేసింది. ఈ నేప‌థ్యంలో బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌కు.. పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని తాజాగా బుధ‌వారం పార్టీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతేకాదు.. ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు.. విమ‌ర్శ‌ల‌కు.. వివాదాల‌కు కూడా పార్టీ ఎలాంటి పూచీ ప‌డ‌ద‌ని పేర్కొంది.

ఎందుకీ ప్ర‌క‌ట‌న‌..

ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట‌.. బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ కొల్లేరు స‌ర‌స్సుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని ద‌శాబ్దాలుగా స‌ర‌స్సు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌న్నారు. అయితే.. గ‌తంలో ఈ స‌ర‌స్సును ర‌క్షిస్తామ‌ని.. కాపాడ‌తామ‌ని హామీ ఇచ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలోనే ఎక్కువ‌గా ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. అదేవిధంగా ప్ర‌స్తుతం కూడా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పూలేద‌న్న ఆయ‌న‌.. కూట‌మి నాయ‌కులు కూడా స‌ర‌స్సును సొంతం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలో త‌మ ఉద్య‌మం మ‌రింత ఎక్కువ‌గా సాగుతుంద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌భుత్వానికి అస‌లు కొల్లేరు స‌ర‌స్సుపై ఏమాత్రం బాధ్య‌త లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. దీనిపై ఉద్య‌మిస్తామ‌న్నారు. ఈ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో బొలిశెట్టి వ్యాఖ్య‌ల‌కు.. జ‌న‌సేన‌కు మ‌ధ్య లింకు పెడుతూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు వ‌స్తున్నాయి. దీనిని అడ్డుకునే క్ర‌మంలో తాజాగా జ‌న‌సేన పార్టీ ఆయ‌న‌కు పార్టీకి మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చి చెప్పింది.