తెలంగాణ మంత్రుల రచ్చపై జనసేన ఫైర్.. పవన్ కు అండగా మంత్రులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోనసీమ జిల్లాల్లో చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని, ఆయనకు తెలంగాణ పట్ల విపరీతమైన అభిమానం ఉందని మంత్రులు కందుల దుర్గేశ్, టీజీ భరత్ అన్నారు.
By: Tupaki Political Desk | 5 Dec 2025 4:15 PM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్న తెలంగాణ మంత్రుల వైఖరిపై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోనసీమ కొబ్బరి రైతుల నష్టాలను చూసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నేతలు వక్రీకరిస్తున్నారని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. తెలంగాణను కించపరిచేలా పవన్ ఎక్కడా మాట్లాడలేదని, తల్లి బిడ్డకు దిష్టి తీసినప్పుడు ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి నా దిష్టి తగలకూడదని అనడం సహజమని మంత్రి దుర్గేశ్ తెలిపారు. పవన్ పై తెలంగాణ మంత్రులు ముప్పేట దాడి పెరిగిన నేపథ్యంలో ఏపీ మంత్రులు దుర్గేశ్, టీజీ భరత్ తాజాగా మీడియాతో మాట్లాడారు. పవన్ కు మద్దతుగా వారుచేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోనసీమ జిల్లాల్లో చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని, ఆయనకు తెలంగాణ పట్ల విపరీతమైన అభిమానం ఉందని మంత్రులు కందుల దుర్గేశ్, టీజీ భరత్ అన్నారు. తెలంగాణను కించపరిచేలా ఉప ముఖ్యమంత్రి ఏనాడూ వ్యాఖ్యలు చేయరని అనేక మంది తెలంగాణ కళాకారులకు తన సినిమాల్లో అవకాశమిచ్చి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జనసేన పార్టీ సైతం వివరణ ఇచ్చిందని, అయినప్పటికీ ఈ అంశాన్ని కొనసాగించడం తెలంగాణ నేతల విచక్షణకు వదిలేస్తున్నామన్నారు. క్యాజువల్ గా చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకోవద్దని హితవు పలికారు.
ఈ అంశం ఇక్కడితో పరిసమాప్తం అవుతుందని భావిస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి మాంత్రికుడని అనడంపైనా మంత్రులు దుర్గేశ్, టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కించపరచడం భావ్యం కాదన్నారు. ఆకాశంపై ఉమ్మి వేస్తే తమపైనే పడుతుందని మరిచిపోవద్దని మాజీ మంత్రి పేర్నికి హితవు పలికారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఫీవర్ పట్టుకుందని జనసేన సోషల్ మీడియా విమర్శిస్తోంది. పవన్ సరదాగా చేసిన వ్యాఖ్యలను పట్టుకుని తెలంగాణ మంత్రులు ఊగిపోతున్నారంటూ ఆరోపిస్తోంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ మంత్రులు రచ్చ చేస్తున్నారని అంటోంది.
