Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లోకి పవ‌న్ ఎంట్రీ.. కాంగ్రెస్‌కు భ‌యం ఎందుకు?

తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్య త్రిముఖ పోరు ఉంది.

By:  Garuda Media   |   6 Feb 2026 9:28 AM IST
తెలంగాణ‌లోకి పవ‌న్ ఎంట్రీ.. కాంగ్రెస్‌కు భ‌యం ఎందుకు?
X

తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్య త్రిముఖ పోరు ఉంది. నిజం చెప్పాలంటే.. బీఆర్ ఎస్‌-కాంగ్రెస్‌ల మ‌ధ్యే వాస్త‌వ పోరు ఉంది. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. రెండు పార్టీల మ‌ధ్యే తీవ్ర రాజ‌కీయ దుమారం కూడా రేగుతోంది. ఓటు బ్యాంకు ప‌రంగా కూడా స్వ‌ల్ప తేడాతో ఇరు పార్టీలు పోరాడుకుంటున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ ప‌ట్టు నిల‌బెట్టుకునేందుకు మ‌రింత‌గా ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నం చేస్తోంది.

అందుకే.. సీఎం రేవంత్ రెడ్డి ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా బీఆర్ ఎస్‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు. వాస్త‌వా నికి తృతీయ ప‌క్షంగా బీజేపీ ఉన్న‌ప్ప‌టికీ.. దాని జోలికి పోవ‌డం లేదు. ఆ పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు కూడా చేయ‌డం లేదు. లేని పార్టీని ప్ర‌స్తావించి.. అన‌వస‌రంగా పెద్ద‌ది చేయ‌డం ఎందుక‌న్న వ్యూహం కాంగ్రెస్‌లో నెల‌కొంది. అయితే.. ఇప్పుడు.. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ‌లో బీజేపీకి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంట్రీ ఇస్తున్నారు.

వాస్త‌వానికి జ‌న‌సేన ఎంట్రీ ఒంట‌రిగా ఉంటే.. కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఎందుకంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఏదైనా ఉంటే అది పోయి.. తమ‌కు లాభిస్తుంద‌ని కాంగ్రెస్ నేత‌లు మురిసిపోయే వారు. కానీ.. బీజేపీతో పొత్తులో భాగంగా ప‌వ‌న్ రంగంలోకి దిగుతుండ‌డం.. బ‌ల‌మైన వాయిస్ ఉన్న నాయ‌కుడు కావ‌డం.. యువ‌త‌ను ఆక‌ర్షించ‌గ‌ల నేర్పు ఉండ‌డంతో ఇప్పుడుతమ ఓటు బ్యాంకుకు ఎక్క‌డ చిల్లు ప‌డుతుందోన‌న్న బెంగ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో ప్ర‌బ‌లంగా ఉంది.

అందుకే.. ప‌వ‌న్ ఎంట్రీ ఇస్తున్నాడ‌ని తెలియ‌గానే కాంగ్రెస్ ఒక‌ర‌కంగా భ‌యానికి గురి అవుతోంద‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇదేస‌మ‌యంలో బీఆర్ ఎస్ పార్టీ మౌనంగా ఉంది. ఎందుకంటే.. గ‌తంలోనే ప‌వ‌న్‌ను టార్గెట్ చేసి.. బీఆర్ ఎస్ అంతో ఇంతో న‌ష్ట‌పోయింది. ఇప్పుడు త‌మ‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా.. కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచేందుకు ప‌వ‌న్ తురుపుముక్క‌లా ప్ర‌యోజ‌న‌కరంగా ఉండాట‌ని ఈ పార్టీ లెక్క‌లు వేస్తోంది.

అందుకే.. బీఆర్ ఎస్ ప‌వ‌న్ ఎంట్రీపై గుంభ‌నంగా ఉంటే.. కాంగ్రెస్ మాత్రం భ‌యంతో ఒకింత క‌ల‌వ‌రం చెందుతోంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. దీనికి మ‌రో రీజ‌న్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ప్రాక్టిక‌ల్‌గా బీజేపీ-జ‌న‌సేన చేస్తున్న స్థానిక ప్ర‌యోగం స‌క్సెస్‌ అయితే.. అది వ‌చ్చే సార్వ‌త్రిక అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి మ‌రింత పుంజుకునే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా అధికారానికే ముప్పు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.