రాయుడి ఎఫెక్ట్: శ్రీకాళహస్తిలో ఏం జరుగుతోంది.. ?
ఇటీవల రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాయుడి హత్య.. జనసేన పార్టీ మాజీ నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోలు అందరికీ తెలిసిందే.
By: Garuda Media | 17 Oct 2025 11:52 AM ISTఇటీవల రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాయుడి హత్య.. జనసేన పార్టీ మాజీ నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోలు అందరికీ తెలిసిందే. రాయుడి డెడ్ బాడీ చెన్నైలో లభించడం అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి కోట వినుత హస్తం ఉందని భావించి ఆమెను అరెస్టు చేసిన విషయం రాజకీయంగా పెద్ద దుమారాలను రూపింది. అయితే అనంతర పరిణామాల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అదేవిధంగా కోట వినుతల మధ్య రాజకీయంగా చోటుచేసుకున్న విభేదాలు తెలిసిందే. ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకున్నారు.
అయితే, ఎంత జరుగుతున్నప్పటికీ ఇటు టిడిపిలో గానీ అటు జనసేనలో కానీ ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. తాము వినుతను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఇక ఆమె గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నట్టుగా జనసేన నాయకులు భావిస్తున్నారు. కానీ, వాస్తవానికి పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ లేదా పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ కూడా వినుత చేసిన వ్యవహారాలు పార్టీకి అంటకుండా అయితే పోవు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది.
మరోవైపు టిడిపి నాయకులూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి విషయంలో మౌనంగా ఉన్నారు. ఆయన ఇటీవల దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని తాను నిజాయితీపరుడినని చెప్పుకొచ్చారు. అయితే టిడిపిలో మాత్రం ఈ విషయంపై ఎవరూ స్పందించడం లేదు. ఎవరి మా నాన వారు మౌనంగా ఉన్నారు. కానీ, శ్రీకాళహస్తిలో మాత్రం ప్రజలు ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న మీడియా సహా సోషల్ మీడియాలో కూడా శ్రీకాళహస్తి రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
ప్రశాంతమైన నియోజకవర్గాన్ని, వివాదరహితంగా ఉన్న నియోజకవర్గాన్ని ఇటు జనసేన అటు టిడిపి నాయకులు ఇద్దరు భ్రష్టు పట్టించారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది బలపడితే ఈ రెండు పార్టీలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసిపికి ఇది అంది వచ్చిన పరిణామంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో రెండు పార్టీలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట.
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీలపై ఉంటుంది. కేవలం బహిష్కరించామని వదిలేస్తే రేపటి రోజున జనసేన పార్టీ బలోపేతం అవటం మాట ఎలా ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం పైనే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
