Begin typing your search above and press return to search.

జనసేనలో చేరికలు అప్పుడేనట...లిస్ట్ రెడీ ?

ఇక ఇప్పటి నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుంటే పార్టీలో కూడా ఇబ్బందులు వస్తాయని జనసేన పెద్దలు భావిస్తున్నారు.

By:  Satya P   |   3 Sept 2026 6:08 AM IST
జనసేనలో చేరికలు అప్పుడేనట...లిస్ట్ రెడీ ?
X

జనసేన సొంతంగా ప్రతీ జిల్లాలో బలపడేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దానికి నాందిగా ఉండబోతున్నాయి. ఇక్కడ మంచి పెర్ఫార్మెన్స్ చూపించాలని భావిస్తోంది. ఏపీలో స్థానిక ఎన్నికలు ముగిసేటప్పటికి ఈ ఏడాది చివరి కావచ్చు. అంటే మరో రెండున్నరేళ్లు సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంటుంది. దాంతో వచ్చే ఏడాదికి జనసేన పొలిటికల్ గా తమ వ్యూహాలను అమలు చేయడానికి కీలకమైనదిగా చూస్తోంది అని అంటున్నారు. ఇక ఏపీలో పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి జనసేన బలాబలాలు కొత్తగా చేరికలు ఆశావహులు, చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలు ఇవన్నీ లిస్ట్ పక్కాగా రెడీ చేసి పెట్టుకుంటోంది అని అంటున్నారు.

వస్తామంటే వద్దంటూ :

ఇదిలా ఉంటే జనసేనలో చేరికలకు ఇంకా ముహూర్తం పెట్టుకోలేదు, ఈలోగా కొన్ని కీలక జిల్లాల నుంచి పార్టీలో చేరుతామని అంటూ విన్నపాలు వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన బలోపేతం అవుదామని చూస్తోంది. దాంతో అక్కడ వైసీపీ మాజీ నేతలు అసంతృప్తులు అలాగే ఇతర పార్టీలలో ఉండలేక బయటపడాలనుకున్న వారు ఇలా చాలా మంది జనసేన గూటికి వచ్చేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. అయితే వారికి కాస్తా ఆగమని జనసేన నుంచి సూచనలు వచ్చాయని చెబుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది సీట్లు ఉంటే పదింటికీ పది టీడీపీ గెలుచుకుంది. ఈ జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలలో తమకు బలం ఉందని జనసేన భావిస్తోంది. మిగిలిన చోట్ల గట్టిగా బలపడాలని చూస్తోంది అని అంటున్నారు.

డీలిమిటేషన్ తేలాకనే :

ఇక ఇప్పటి నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుంటే పార్టీలో కూడా ఇబ్బందులు వస్తాయని జనసేన పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న వారికి కొత్తగా వచ్చిన వారికి మధ్య నప్పక వర్గ పోరు ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారుట. వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని జనసేనలో అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూప స్వభావాలు మారిపోతాయని అంటున్నారు. అలా ఎక్కువ సీట్లు కూడా పెరిగే చాన్స్ ఉంటుందని లెక్క వేస్తున్నారు. దాంతో జనసేనకు కూడా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో పట్టు వస్తుందని అంటున్నారు.

ఎక్కువ సీట్లు కోసం :

ఇక ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 250 సీట్ల దాకా పెంచే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగితే అదనంగా 75 సీట్లు వస్తాయి. అందులో జనసేన వాటా ఎంతో పక్కాగా లెక్క తేల్చుకున్న తరువాతనే పార్టీలో చేరే వారి మెడలో కండువా వేయాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల పార్టీ బలంగా ఉంటుంది, అదే సమయంలో అవసరమైన చోట నాయకులు కూడా ఉంటారని వ్యూహ రచన చేస్తోంది. దాంతో జనసేనలో చేరాలనుకునే వారికి జస్ట్ కాస్తా ఆగండి అని బదులు వస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన 2029 ఎన్నికల మీద పూర్తి ఫోకస్ పెట్టిందని చెబుతున్నారు. అలాగే పార్టీని పటిష్టం చేసుకునే విషయంలో ఒక విధానం అనుసరిస్తోంది అని అంటున్నారు.