జనసేనలో ఉద్యమి...సాధక్...ప్రదాత
జనసేనలో కొత్త పేర్లు వచ్చాయి. జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. ఈ ఏడాది మార్చితో పార్టీ 12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతోంది.
By: Satya P | 16 Feb 2026 6:00 AM ISTజనసేనలో కొత్త పేర్లు వచ్చాయి. జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. ఈ ఏడాది మార్చితో పార్టీ 12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దానిని సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి. అదే విధంగా జనసేనలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కూడా పెద్ద ఎత్తున మొదలైంది. పవన్ ఏకంగా రెండు కోట్ల రూపాయలు విరాళంగా పార్టీకి ఇచ్చి మరీ తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం విశేషం. కేవలం 150 మందితో మొదలెట్తిన జనసేన ఈ రోజుల లక్షల మందితో ముందుకు సాగుతోంది అని జనసేన అధినాయకత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.
కీలక మార్పులు :
ఇదిలా ఉంటే జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని ఇక మీదట వర్గీకరించి వారి పనితీరుని బట్టి పార్టీలో మంచి భవిష్యత్తుని అందించాలని జనసేన అధినాయకత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ కోసం అహరహం శ్రమించే వారిని ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరించి పిలుస్తామని అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఉద్యమిగా ఎవరంటే :
జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా సమగ్రంగా అర్ధం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తారు అని అంటున్నారు. వీరు పార్టీలో తొలి మెట్టుగా ఉంటూ పార్టీ అంటే విపరీతమైన అభిమానంతో పనిచేస్తారు అన్న మాట.
సాధక్ :
ఇక సాధక్ ఎవరు అంటే పార్టీ చేసే పోరాటాలు అలాగే ఉద్యమాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ ముందుకు సాగే కరడు కట్టిన కార్యకర్తలుగా ఉంటారు అంతే కాదు కొత్త వారిని పార్టీ వైపుగా నడిపించేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. అలాగే యువతరం నవతరంలో జనసేన పార్టీ పట్ల ప్రేరణను కలిగిస్తారు. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. పెద్ద ఎత్తున సభ్యత్వాలు కూడా చేయిస్తూ పార్టీకి బలమైన పునాదులుగా ఉంటారు.
ప్రదాతలుగా :
ప్రదాతలు ఎవరు అన్నది చూస్తే కనుక వీరు పార్టీకి ఆర్ధికంగా సాయం చేసేవారుగా ఉంటారు. ఇతోధికంగా పార్టీకి తమ వంతుగా ధన సాయం చేస్తారు, అలాగే సాంకేతికంగా కూడా పార్టీకి సహకారం అందించేవారు కూడా ప్రదాతలుగానే ఉంటారు. వీరే కాకుండా జనసేన సిద్ధాంతాలను జనంలో ఉంచుతూ పార్టీకి మేధాపరమైన సహకారం అందించే వారిని ఈ జాబితలోకి పార్టీ చేర్చింది. ఈ విధంగా ఉన్న వారిని అందరినీ పార్టీ గుర్తు పెట్టుకుని సముచితమైన స్థానం కల్పిస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో ఏ ప్రాంతీయ పార్టీలో లేని విధంగా జనసేన కొత్త వర్గీకరణతో కొత్త వారిని కొత్త శక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తూ వారిని పార్టీ వైపుగా మళ్ళిస్తూ పార్టీని మరో తరం ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా తన ప్రణాళికలు రూపకల్పన చేసింది అని చెప్పాల్సి ఉంది.
