Begin typing your search above and press return to search.

ఇది జనసేన జెన్ జీ ...వ్యూహం అదిరింది !

ఇక జనసేన పార్టీ పెట్టి చాలా కాలం అయింది సంస్థాగతంగా కూడా అనేక మార్పులు చేర్పులూ ఇటీవల కాలంలో చేస్తున్నారు.

By:  Satya P   |   31 Aug 2026 9:27 AM IST
ఇది జనసేన జెన్ జీ ...వ్యూహం అదిరింది !
X

ఈ రోజున దేశమంతా యూత్ నామస్మరణ చేస్తున్న సంగతి విధితమే. జెన్ జీ దెబ్బ ఏంటో దేశం మొత్తం కొద్ది నెలల క్రితమే కళ్లారా చూసింది. ఎంతటి బలమైన ప్రభుత్వాన్ని అయినా తమ డిమాండ్ల ద్వారా దారికి తెచ్చిన సత్తా తమకు ఉందని జెన్ జీలు నిరూపించారు. ఆనాటి నుంచే జెన్ జీ జపం మొదలైంది. బీజేపీ పెద్దల నుంచి కాంగ్రెస్ శిబిరం నుంచి దేశంలోని అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు సైతం జెన్ జీ అనే అంటూ సాగుతున్న నేపధ్యం ఉంది. జెన్ జీలు తోడుంటే సక్సెస్ ట్రాక్ పట్టడం ఈజీ అన్నది తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేసిన తరువాత ఎవరైనా అదే రూట్ ఫాలో అవుతారు. ఇక ఏపీలో చూస్తే జెన్ జీ అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నా కూడా వారిని ఆకట్టుకునే విషయంలో మాత్రం అందరి కంటే ముందుగా వేగంగా అడుగులు వేస్తోంది జనసేన పార్టీ అనే చెప్పాలి.

యువ విభాగం అంటూ :

ఇక జనసేన పార్టీ పెట్టి చాలా కాలం అయింది సంస్థాగతంగా కూడా అనేక మార్పులు చేర్పులూ ఇటీవల కాలంలో చేస్తున్నారు. పార్టీని పటిష్టం చేస్తేనే భవిష్యత్తు అన్న కోణంలో అధినాయకత్వం సీరియస్ గానే ఉంది. ఈ క్రమంలో మహిళలు ప్లస్ యువతకు పెద్ద పీట వేయాలని అనుకుంటోంది. వీర మహిళలకు కీలక స్థానం పార్టీ పదవుల్లో ఇస్తున్నారు. ఎటూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే వారికి తప్పనిసరిగా రాజ్యాంగబద్ధమైన వాటా దక్కుతుంది. ఇక యువత కోసం కూడా జనసేన చర్యలు తీసుకుంటోంది. అన్ని పార్టీలలో యూత్ వింగ్ అన్నది ఉంటుంది. జనసేన మాత్రం దానికి కొత్తగా ఆవిష్కరించబోవడమే విశేషం అని అంటున్నారు.

అధినేత పుట్టిన రోజున :

ఇక యూత్ వింగ్ ప్రారంభం కూడా అధినేత పవన్ పుట్టిన రోజు సందర్భంగా చేపట్టడం ఎమోషనల్ టచ్ ఇచ్చినట్లుగా ఉంది. అంతే కాదు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను పిఠాపురం వేదికగా చేసుకుని నిర్వహిస్తున్నారు. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. దాంతో జనసేన యువ సందేశం అక్కడ నుంచే ఏపీ మొత్తం బిగ్ సౌండ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజున ఉదయం 11 గంటలకు పిఠాపురంలో యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని చెబుతున్నారు.

స్థానిక ఎన్నికలతోనే :

ఇక ముందున్నవి స్థానిక ఎన్నికలు. అందుకే అక్కడ నుంచే జనసేనలోని యువసేన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో యువతను భాగస్వామ్యం చేయడం అన్నది జనసేన పార్టీ కార్యాచరణ గా ఉంది. జనసేన యువ విభాగానికి సంబంధించి లోగో గీతం ఆవిష్కరణ ఆ రోజున జరగనుంది. ఆ విధంగా జనసేనలో యువ గళం గట్టిగా వినిపించేలా అది ఏపీ వ్యాప్తం అయ్యేలా భారీ యాక్షన్ ప్లాన్ తోనే గాజు గ్లాస్ పార్టీ సర్వం సిద్ధం చేసుకుందని అంటున్నారు. ఈసారి జరిగే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు యువతకు ఇస్తారని అంటున్నారు. జెన్ జీని అలా ఆకట్టుకుని భవిష్యత్తులో జనసేన మరింతగా రాణించి తమ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికే ఈ యువజన విభాగాలు అని చెబుతున్నారు. మొత్తానికి పక్కా ప్లాన్ తోనే జనసేన జెనీ సేన ఉందని అంటున్నారు.