Begin typing your search above and press return to search.

కవిత వర్సెస్ జనసేన.. ‘ఎక్స్’లో ముదిరిన మాటల యుద్ధం!

తాజాగా కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ రక్షణ సమితి, జనసేన తెలంగాణ విభాగం మధ్య ‘ఎక్స్‌’లో మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు.. ముఖ్యంగా పవన్ కల్యాణ్, కవితపై పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు.

By:  A.N.Kumar   |   19 Sept 2026 11:29 PM IST
కవిత వర్సెస్ జనసేన.. ‘ఎక్స్’లో ముదిరిన మాటల యుద్ధం!
X

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు సాధారణమే అయినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా నేతలు, పార్టీల అధికారిక ఖాతాల మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ రక్షణ సమితి, జనసేన తెలంగాణ విభాగం మధ్య ‘ఎక్స్‌’లో మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు.. ముఖ్యంగా పవన్ కల్యాణ్, కవితపై పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు.

ఈ వివాదానికి తెలంగాణ రక్షణ సమితి చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు కారణమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఆ పార్టీ ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసి వ్యంగ్యంగా విమర్శించింది. అనంతరం హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన భూమి చెరువు పరిధిలో ఉందంటూ ఆరోపణలు చేసింది. చెరువు భూమిని ఆక్రమించి కంచె వేసినంత మాత్రాన అది సొంత భూమి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా.. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తులకు మించి తన వద్ద ఒక్క గజం భూమి ఉన్నట్లు తేలినా ప్రభుత్వానికి అప్పగిస్తానని తమ నాయకురాలు స్పష్టంగా చెప్పారని తెలంగాణ రక్షణ సమితి తన పోస్టులో పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే మీరే ఇబ్బందుల్లో పడతారంటూ జనసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

దీనికి జనసేన తెలంగాణ విభాగం కూడా అదే స్థాయిలో స్పందించింది. కవిత ఆస్తులపై ప్రశ్నలు సంధిస్తూ ‘మీకు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?’ అంటూ పోస్టు చేసింది. గతంలో బ్యూటీ పార్లర్ నిర్వహించిన కవితకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో సంపాదించారా? ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించారా? తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నారైలు, కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేశారా? అంటూ పలు ఆరోపణలు చేసింది.

అదే సమయంలో నిజామాబాద్ రైతుల సమస్యను కూడా జనసేన ప్రస్తావించింది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుందని ఆరోపిస్తూ.. కవిత కొత్త రాజకీయ డ్రామాకు తెరతీశారని విమర్శించింది. ఈ వ్యాఖ్యలకు అనుకూలంగా జనసేన తెలంగాణ తన పోస్టులో ఘాటు హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించింది.

ఇరు పార్టీల అధికారిక సోషల్ మీడియా ఖాతాల మధ్య మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఆయా పార్టీల అభిమానుల మధ్యకు కూడా చేరింది. పవన్ కల్యాణ్ అభిమానులు, కవిత మద్దతుదారులు పరస్పరం పోస్టులు, కామెంట్లతో స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఇరు పార్టీలూ చేసిన భూవివాదం, ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ఆరోపణలుగానే ఉన్నాయి. వాటిపై అధికారికంగా నిర్ధారిత ఆధారాలు లేదా తుది నిర్ణయాలు ఉన్నాయా అన్నది వేరుగా పరిశీలించాల్సిన అంశం. మొత్తంగా చూస్తే తెలంగాణ రాజకీయాల్లో జనసేన–కవిత వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది.