Begin typing your search above and press return to search.

తెలంగాణలో మార్పు కావాలి...పవన్ మాటల వెనక వ్యూహం ?

తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికి సగం పాలన పూర్తి అయింది మరో రెండున్నరేళ్ళ పాటు చేతిలో అధికారం కాంగ్రెస్ కి ఉంది.

By:  Satya P   |   3 Jun 2026 9:20 AM IST
తెలంగాణలో మార్పు కావాలి...పవన్ మాటల వెనక వ్యూహం ?
X

తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికి సగం పాలన పూర్తి అయింది మరో రెండున్నరేళ్ళ పాటు చేతిలో అధికారం కాంగ్రెస్ కి ఉంది. మళ్ళీ మళ్లీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని రేవంత్ రెడ్డి సందర్భం వచ్చిన ప్రతీ సారీ గట్టిగానే చెబుతున్నారు. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకోవాలని బీఆర్ఎస్ కాచుకుని ఉంది. ఇక బీజేపీ సైతం 2028 ఎన్నికల మీద గురి పెట్టి ఉంది. ఇదీ తెలంగాణాలో గ్రౌండ్ లో ఉన్న పొలిటికల్ రియల్ పిక్చర్. అలాంటి చోట జనసేన ఎంట్రీ ఇస్తామని అంటోంది. ఇక మీదట ఇక్కడ పోటీ చేస్తామని కూడా పవన్ బల్ల గుద్ది మరీ చెప్పారు. అంతే కాదు తనకు కావాల్సింది మార్పు అన్నారు. మరి ఒక వైపు రాజకీయంగా పోటీకి దిగుతామని చెప్పి సామాజిక తెలంగాణా అంటున్నారు. మరి ఏ మార్పుని ఆయన కోరుకుంటున్నారు అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది.

ద్వేషం లేదు అంటూ :

ఇక తనకు కానీ జనసేనకు గానీ తెలంగాణా మీద ఎలాంటి ద్వేషం లేదని పవన్ అన్నారు. అయితే జనసేన తెలంగాణాను వ్యతిరేకించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే వ్యతిరేకించాం అని ఆయన స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ తలుపులు మూసేసి రెండు రాష్ట్రాలను విభజించడం తప్పని చెప్పాను అని అన్నారు. అంతేకానీ తెలంగాణా పైన వేరే ఎలాంటి భేదభావమూ లేదని పూర్తి వివరణ ఇచ్చారు. ఇక ఏపీలో తనను తిరగనివ్వమని చెప్పిన సమయంలో వారాహి యాత్రకు అనుమతిచ్చిందే తెలంగాణ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలంగాణా నుంచి తానేం కోరుకోట్లేదని, ఒక్క మార్పును తప్ప అని పవన్ వ్యాఖ్యానించడం విశేషం.

ఏ రకమైన మార్పు :

జనసేన సభను నిర్వహించనీయలేదు కానీ దాని పేరు నవ నిర్మాణ సభ. అంటే కొత్తగా తెలంగాణాను నిర్మించడం అన్న మాట. ఇప్పటిదాకా తెలంగాణాను బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పాలించాయి. మరి ఈ రెండు పార్టీలు చేయలేని తీసుకుని రాలేని మార్పు ఏదో జనసేన ఆకాంక్షిస్తోందా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం. జనసేన ఊహించే ఆ మార్పు ఏమిటి ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఎవరి ఊహకు వారు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే పవన్ నోటి వెంట మార్పు అన్న మాట మాత్రమే వచ్చింది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మీద నిప్పులు చెరిగారు. అంతే కాదు ప్రతీ సమస్య మీద పోరాడుతాను అన్నారు.

2028 ఎన్నికలే టార్గెట్ :

కాంగ్రెస్ తీరునే అడుగడుగునా ఎండగట్టారు. నాటి వైఎస్సార్ నుంచి నేటి నేతల వరకూ అందరికీ తూర్పార పట్టారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే పవన్ సమర శంఖం పూరించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాదు కాంగ్రెస్ మీదనే ఆయన ఫైర్ అయిన తీరుని చూస్తే కనుక మార్పు అన్నది ఆ పార్టీని రాజకీయంగా సవాల్ చేయడం ద్వారానేనా అన్నది కూడా చర్చ సాగుతొంది. ఇక ఏపీలో చూస్తే బీజేపీ జనసేన మిత్ర పక్షాలు. తెలంగాణాలో బీజేపీ తన దారిన తాను పోరాటం చేస్తోంది. జనసేన తన రాజకీయం ఏమిటో చెప్పకనే చెప్పింది. అయితే ఇక్కడా ఈ రెండు పార్టీలూ మిత్రులుగా మారి కొత్త శక్తిగా రంగంలోకి దిగుతాయా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అలాగే దీనిని బట్టి చూస్తే 2028 ఎన్నికలే టార్గెట్ గానేనా ఈ మార్పు కావాలి అన్న నినాదం ఎత్తుకున్నది అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి పవన్ మాటల వెనక అయితే పక్కాగా వ్యూహం ఉందని అంటున్నారు. అది ఏమిటి అన్నది తొందరలోనే తెలుస్తుందని కూడా అంటున్నారు.