లోకల్ ఫైట్.. జనసేన వ్యూహాం ఏంటి? పవనే అలా మాట్లాడిస్తున్నారా?!
కూటమిలో టీడీపీ-జనసేన సంబంధాలపై విస్తృత చర్చ జరుగుతోంది. తాము మరో మూడు సాధారణ ఎన్నికల వరకు కలిసి ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేశ్ స్పష్టంగా ప్రకటనలు చేస్తున్నారు.
By: Tupaki Political Desk | 15 Sept 2026 4:07 PM ISTస్థానిక ఎన్నికల విషయంలో జనసేన పార్టీ వ్యూహం ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా తాము త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేమని, బలం ఉన్న చోట పోటీచేస్తామని కరాఖండీగా చెబుతున్న జనసేన పార్టీ అదే సమయంలో మిత్రపక్షం టీడీపీని ఇరుకున పెట్టేలా ప్రకటనలు చేస్తుండటం వ్యూహాంలో భాగమేనా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు బలం ఉందని ఒకవైపు చెబుతూ, మరోవైపు మిత్రపక్షం టీడీపీ తొక్కేస్తుందంటూ ప్రకటనలు చేయడమే అంతుచిక్కడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలో టీడీపీ వైఖరిని ప్రశ్నిస్తూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన ప్రకటనకు ఆ పార్టీ అధిష్టానం కూడా కట్టుబడి ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయని అంటున్నారు.
కూటమిలో టీడీపీ-జనసేన సంబంధాలపై విస్తృత చర్చ జరుగుతోంది. తాము మరో మూడు సాధారణ ఎన్నికల వరకు కలిసి ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేశ్ స్పష్టంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ, ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవల ఒంగోలులో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ మిత్రపక్షం టీడీపీకి చెందిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై బహిరంగ విమర్శలు చేయగా, కొద్దిరోజుల క్రితం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి ఏకంగా టీడీపీ పార్టీ వైఖరిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పెంచాయని అంటున్నారు.
స్థానిక ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రకటనలు చేయడాన్ని వ్యూహంలో భాగంగానే చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన నేతలు వరుసగా కూటమి ఐక్యతను ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నప్పటికీ ఆ పార్టీ హైకమాండ్ కల్పించుకోకపోవడం చూస్తే తమ మనోగతం తెలియజేసేందుకు ఆ పార్టీ ఒక పద్ధతి ప్రకారం ఇటువంటి ఎత్తుగడ ఎంచుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీతో సమానంగా ప్రాతినిధ్యం ఉండాలని జనసేన నేతలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే పెద్దపార్టీ అయిన టీడీపీతో సమానంగా ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ తమ బలానికి తగినట్లు గౌరవం పెరిగేటట్లు సీట్ల కేటాయింపు ఉండాలని జనసేన కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో జనసేనకు ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తమ పార్టీకి వదిలేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో అదనంగా విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, ఒంగోలు, గుంటూరు కార్పొరేషన్లు జనసేన అడుగుతుందని చెబుతున్నారు. కాకినాడ, తిరుపతి కార్పొరేషన్లలో జనసేన ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ స్థానాలు తమకే ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నేతలు కంగారు పడుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 17 కార్పొరేషన్లు ఉండగా, అందులో 8 నుంచి 9 స్థానాలను జనసేన అడుగుతుండటమే పరిస్థితిని వేడెక్కిస్తోందని అంటున్నారు. అయితే ఇదంతా జనసేన వ్యూహాత్మక ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు. కూటమిలో టీడీపీపై ఈ స్థాయిలో ఒత్తిడి తేకపోతే జనసేనకు రెండు లేదా మూడు స్థానాలతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని, సగం కార్పొరేషన్లకు కర్చీఫ్ వేస్తే నాలుగో వంతు స్థానాలు అయినా ఇవ్వకపోతారా? అన్నట్లు ఆ పార్టీ ఆలోచనలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
