పవన్ బ్యాలెన్స్ పాలిటిక్స్...చాన్స్ కోసం సైనిక్స్ !
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 30–40 శాతం స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జనసేన కార్యకర్తలు కోరుతున్నట్లు సమాచారం. 13 వేలకు పైగా పంచాయతీల్లో తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి, టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు కథనం. కూటమి ఐక్యతను కాపాడుతూనే జనసేనకు ఎక్కువ స్థానాలు దక్కేలా పవన్ ఎలా సమన్వయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
By: Satya P | 19 Nov 2026 8:44 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచనలు అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధికి ఓటు వేస్తారు. అన్నింటికీ మించి ఏపీలో కూటమి ప్రభుత్వం సాఫీగా సుదీర్ఘ కాలం పనిచేస్తే విభజన గాయాలతో దెబ్బ తిన్న ఏపీ చాలా వేగంగా ఎత్తిగిల్లుతుందని పవన్ భావిస్తూ వస్తున్నారు. అందుకే ఆయన 2024 ఎన్నికల్లో తగ్గి పోటీ చేశారు. ఇక మునిసిపోల్స్ తో పాటు పరిషత్తు ఎన్నికల్లో సమంజసమైన తీరులోనే పొత్తులు నెరిపారు. ఇక పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సైనికులు తమకు ఎక్కువ సీట్లు కావాలని కోరుతున్నారు.
పవన్ చేతిలోనే :
ఏపీలో కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ పవన్ చేతిలో ఉంది. పంచాయతీలకు నిధులు విధులు అభివృద్ధి అన్నీ చూసే అతి ముఖ్య బాధ్యతలో పవన్ ఉన్నారు. దాంతో తమ నేత చేతిలో పంచాయతీ రాజ్ ఉంటే ఎక్కువ పంచాయతీలలో తాము పోటీ చేస్తే గ్రామాలలో విస్తరిస్తామని అది జనసేన రాజకీయంగా బలోపేతం కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. ఏపీలో చూస్తే 13 వేల పై చిలుకు పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కనీసం ముప్పయి నుంచి నలభై శాతం అయినా జనసేన పోటీ చేయడానికి చాన్స్ ఇవ్వాలని జనసేన సైనికులు కోరుతున్నారు. అంటే నాలుగు వేల దాకా పంచాయతీలు అన్న మాట. తమకు గ్రామీణ ప్రాంతాలలో బలం ఉందని వారు అంటున్నారు.
పార్టీలకు అతీతంగా :
అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కానీ మద్దతు దారులు అంటూ వారి మీద మరో రకం ముద్ర ఎప్పటి నుంచో ఉంది. పేరుకు మాత్రం పార్టీలు కండువాలు జెండాలు ఉండవు కానీ ఎవరు ఏ పార్టీ మనిషో స్పష్టంగా తెలుస్తుంది. అయితే పంచాయతీలు అంటే మరీ గ్రౌండ్ లెవెల్ లో పోటీలు. అక్కడ వేలాది స్థానాలు ఉంటాయి. దాంతో కూటమి పొత్తులు సవ్యంగా సాఫీగా అక్కడ పొసగుతాయా అన్నది అయితే చెప్పలేని పరిస్థితి. అయితే ప్రతీ వార్డూ కీలకమే అని ఐక్యత ముఖ్యమని కూటమి నాయకులు చెబుతున్నారు.
బలం ఉన్న చోట్లలో :
ఇక చూస్తే తమకు బలం ఉన్న చోట్లలో పోటీకి దిగుతామని జనసేనలో ఉంది. అలాగే టీడీపీకి బలం ఉన్న చోట్ల తాము మద్దతు ఇస్తామని అంటున్నారు. అయితే పెద్ద పార్టీగా టీడీపీ అన్ని చోట్లా సత్తా చాటడానికి ఆస్కారం ఉంది. అందువల్ల తాము పోటీ చేసే చోట్ల పొత్తులలో భాగంగా తమకు ఎక్కువగా కేటాయింపులు ఉండాలని జనసేన నుంచి వినిపిస్తున్న మాట. మరి పంచాయతీలలో పొత్తులు ఏ దిశగా సాగుతాయి అన్నది ఫలితాల తరువాతనే చూడాల్సి ఉంది.
మొగ్గు ఉండాల్సిందేనా :
మరో వైపు చూస్తే పవన్ కూటమి ఐక్యత కోసం ప్రభుత్వం సాఫీగా సాగడం కోసం ఇంత కాలం ప్రదర్శించిన పొలిటికల్ బ్యాలెన్సింగ్ విధానానికి 2029 ఎన్నికలు ఒక సవాల్ గా మారనున్నాయని అంటున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పొత్తులు క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల వికటించి రెబెల్స్ రంగంలో నిలబడ్డారు. ఈసారి జనసేన ఆశలు ఆకాంక్షలు అర్థం చేసుకుని తమ వైపు మొగ్గు చూపించి ఎక్కువ సీట్లు కోరాలన్నది ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. అలా జరిగితేనే జనసేన ఎన్నిక ఎన్నికకూ మరింతగా బలపడుతుందని రాజ్యాధికారానికి చేరువ అవుతుందని అంటున్నారు. మరి పవన్ ఒక వైపు కూటమి ఐక్యతను పరిరక్షించుకుంటూ మరో వైపు సైనికుల మనోభావాలు దెబ్బ తినకుండా ఏ విధంగా నెగ్గించుకుని వస్తారు అన్నది చూడాల్సి ఉంది.
