Begin typing your search above and press return to search.

జనసేన తెరపైకి కొత్త ముఖాలు...వారికే ప్రయారిటీ ?

జనసేన సంస్థాగతంగా గట్టి పరచుకోవాలని చూస్తోంది. అధినేత పవన్ కి ఉన్న జనాదరణ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు.

By:  Satya P   |   1 Aug 2026 1:00 AM IST
జనసేన తెరపైకి కొత్త ముఖాలు...వారికే ప్రయారిటీ ?
X

జనసేన సంస్థాగతంగా గట్టి పరచుకోవాలని చూస్తోంది. అధినేత పవన్ కి ఉన్న జనాదరణ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఆయన వెండి తెర మీద పవర్ స్టార్. ఇక రాజకీయాల్లోనూ ఆ ఇమేజ్ పూర్తి స్థాయిలో కన్వర్ట్ కావాలని జనసేన చూస్తోంది. ఈ విషయంలో కీలకమైన ఆలోచనలు చేస్తోంది. ఏపీలో బలమైన సామాజిక వర్గం అండదండలు జనసేనకు ఉన్నాయి. యూత్ సపోర్టు ఉంది. మహిళల ఆదరణ ఉంది. దాంతో ఇవన్నీ కూడా పార్టీ బలోపేతానికి పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. జనసేన సంస్థాగతంతో కొత్తగా కనిపించాలని చూస్తోంది. ఇతర పార్టీలకు భిన్నంగా తమ పార్టీలో ఎక్కువగా వారికే పెద్ద పీట వేయాలని చూస్తున్నారు.

మహిళలకే పదవులు :

జనసేనలో పదవుల పందేరానికి కసరత్తు మొదలైంది. ఆ పని మీద గత కొన్ని రోజులుగా పవన్ నిమగ్నం అయి ఉన్నారు. ఆయన కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నా ఆ నొప్పిని సైతం అధిగమిస్తూ పార్టీలో బాధ్యులను ఎంపిక చేసేందుకు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇదిలా ఉంటే పవన్ పరిశీలనలో వెల్లడిన విషయాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ పదవులలో మహిళలకు ప్రాధాన్యత గతంలో అంతగా లేదని ఆ లోటుని భర్తీ చేసుకుంటూ అంతకు మించి అన్నట్లుగా వారికి కీలక పదవులు కట్టబెట్టాలని సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. దాని వల్ల పార్టీకి మేలు జరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

మహిళా బిల్లు నేపథ్యం :

కేంద్రంలో మహిళా బిల్లు అమలు అన్నది పెండింగులో ఉంది. అది 2029 ఎన్నికల నాటికి కార్యరూపం దాల్చవచ్చు. అంటే అపుడు మూడవ వంతు సీట్లు మహిళలకు దక్కుతాయి. అందువల్ల వారిని ఇప్పటి నుంచే కార్యోన్ముఖులుగా చేయడం పార్టీ బాధ్యతలను అప్పగించడం ద్వారా ముందుకు తీసుకుని వస్తే కనుక రేపటి రోజున వారే ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారుట. అందుకే జనసేన కార్యవర్గాలలో ఎక్కువగా వారి పేర్లు కనిపిస్తాయని అంటున్నారు. ఇక దేశంలఒ ఎక్కడ ఎన్నికలు జరిగినా మహిళలు యువత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దాంతో జనసేన కూడా వ్యూహం మారుస్తోంది అని అంటున్నారు.

పనిచేసే వారికే :

అలాగని అందరికీ కాదని ఎవరైతే పార్టీ కోసం గట్టిగా కష్టపడతారో వారిని చూసి మరీ గుర్తింపు ఇవ్వాలని చూస్తున్నారుట. ఇక జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యలు ఉంటే ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి ఉన్నారు. ఈసారి ఆ సంఖ్యను పెంచడానికి చూస్తున్నారు అని అంటున్నారు. నామినేటెడ్ పదవులు కూడా వారికి తక్కువగా వచ్చాయని ఆ రేషియో కూడా పెంచాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీ పదవుల విషయంలో అయితే ఏ మాత్రం తక్కువ కాకుండా చూడాలని జనసేన నిర్ణయించింది అని అంటున్నారు.

నిబద్ధత అంకితభావం :

ఇక మహిళలు అయితే నిబద్ధతతో అంకిత భావంతో పనిచేస్తారు అని కూడా భావిస్తున్నారు. అదే మగవారు అయితే వివాదాలతో చిక్కుకోవడం జరుగుతోంది అన్న భావన ఉంది. అందుకే మహిళలకు పెద్ద పీట వేస్తే రాజకీయాలను అలాగే చూస్తారని సంస్కారయుతమైన భాషతో పాటు పార్టీ సిద్ధాంతాలను జనంలో ఉంచుతారని ఆ విధంగా పార్టీకి మైలేజ్ వస్తుందని మహిళా లోకం నుంచి ఆదరణ కూడా పెరుగుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఏపీలో మూడవ వంతు నియోజకవర్గాల్లో ఈసారి మహిళలకు ఇంచార్జి పదవులు దక్కుతాయని అంటున్నారు.

అధ్యక్ష పీఠాలు కూడా :

అంతే కాకుండా ఏపీలో ఉన్న మొత్తం 28 జిల్లాలలో కనీసం పదికి తక్కువ కాకుండా అధ్యక్ష పీఠాలు కూడా వీర మహిళలకు దక్కబోతున్నాయని అంటున్నారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఇతర కీలక పదవులు అన్నీ వారికే అంటున్నారు. మరో విశేషం ఏంటి అంటే పార్టీ అధికార ప్రతినిధి పదవులకు కూడా మహిళలను పెద్ద ఎత్తున ఎంపిక చేయాలని జనసేన నిర్ణయించుకుంది అని చెబుతున్నారు. ఆ విధంగా చేయడం వల్ల టీవీ మీడియాలలో డిబేట్లు జరిగినపుడు అర్ధవంతంగా ఉంటాయని పార్టీ వాయిస్ అన్నది జనంలోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు అని అంటున్నారు.