Begin typing your search above and press return to search.

జనసేన జాతీయ గళం...పవన్ దిశా నిర్దేశం

జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా 2014 మార్చి 14న ఆవిర్భవించింది. పదేళ్ళ పోరాటం తరువాత ఏపీలో జనసేన విజయాలను సాధించింది.

By:  Satya P   |   14 Jun 2026 9:54 PM IST
జనసేన జాతీయ గళం...పవన్ దిశా నిర్దేశం
X

జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా 2014 మార్చి 14న ఆవిర్భవించింది. పదేళ్ళ పోరాటం తరువాత ఏపీలో జనసేన విజయాలను సాధించింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కీలక స్థానాన్ని అందుకున్నారు. ఇక జనసేన తన భావజాలం ప్రాంతీయంగా బలంగా ఉంటూనే జాతీయ స్రవంతిలో సాగాలన్నదిగా పెట్టుకుంది. ప్రాంతాలుగా వేరుగా ఉన్నా జాతీయ భావన ముఖ్యమని జనసేన నినదిస్తోంది. ఈ క్రమంలో మాటలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఈ సమైక్య భావనను విస్తృతం చేయాలన్న ఉదేశ్యంలో జనసేన తొలిసారిగా జాతీయ స్థాయిలో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇదిపుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

జాతీయ సమైక్యత కోసం :

ఇదిలా ఉంటే జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 15న సోమవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ సమగ్రత దృక్పథంలో భాగంగా నిర్వహించే ఈ సమావేశానికి సేన ప్రస్థానం-జాతీయ సమైక్యత కోసం అన్న పేరు పెట్టారు. దాంతో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఇక జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ మధ్య కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది అన్నది ఈ సమావేశంలో చర్చించడమే కాకుండా జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పార్టీ నాయకులందరికీ పూర్తిగా వివరించనున్నారు.

ఢిల్లీ వేదిక అందుకే :

ఈ సమావేశానికి ఢిల్లీని వేదికగా ఎంచుకోవడం వెనక కూడా ముఖ్య ఉద్దేశ్యం ఉంది. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మీటింగుకు ఏపీ నుంచి నెగ్గిన జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. వారితో పాటుగా తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారందరికీ ఈ జాతీయ స్పూర్తి జనసేన భావజాలాన్ని పవన్ కళ్యాణ్ వివరిస్తూనే దిశానిర్దేశం చేయనున్నారు.

ఒక రోజంతా సమావేశం :

ఈ సమావేశాన్ని జనసేన చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఒక రోజంతా ఈ సమావేశం నిర్వహించడమే దాని లక్ష్య సాధన ఏమిటి అన్నది తెలియచేస్తోంది. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలన్నది జనసేన విధానంగా ఉంది. దానిని గట్టిగా ఈ సమావేశం ద్వారా ఢిల్లీ వేదికగా చాటి చెబుతారు అని అంటున్నారు. అదే విధంగా వర్తమాన పరిస్థితుల్లో దేశంలోని అంతా సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ఢిల్లీలోని ఒక హొటల్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం చేయబోయే తీర్మానాల మీద కూడా అందరి దృష్టి ఉంది. మరి పవన్ ఏమి మాట్లాడుతారు అన్నది చూడాలి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో జనసేన మరింతగా విస్తరించే యోచనతో ఈ మీటింగ్ ని ఏర్పాటు చేశారు అని అంటున్నారు.