Begin typing your search above and press return to search.

సీట్లు ఉన్నాయి.. నాయకులే లేరు.. జనసేనలో విచిత్రం

రాజకీయాలు అంటే కేవలం అధికారం కోసం కాదని, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించాలనే ఆకాంక్షతో జనసేన ఆవిర్భవించింది.

By:  Tupaki Political Desk   |   18 Oct 2026 12:00 PM IST
సీట్లు ఉన్నాయి.. నాయకులే లేరు.. జనసేనలో విచిత్రం
X

మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కోసం పోటీ పడిన జనసేన పార్టీ ఇతర పార్టీల నుంచి నేతలను ఎరువు తెచ్చుకోవడమే హాట్ టాపిక్ అవుతోంది. కూటమిలోని ప్రధాన పక్షమైన టీడీపీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రెండు కార్పొరేషన్లు, 20 మున్సిపల్ చైర్మన్ పదవులను జన సేన కైవసం చేసుకుంది. అయితే ఆయా స్థానాల్లో సరైన అభ్యర్థుల లేక ఇతర పార్టీల నుంచి నేతలను దిగుమతి చేసుకుంటోందని అంటున్నారు. ఈ పరిస్థితిపై సొంత పార్టీ కార్యకర్తలే కన్నెర్ర చేస్తున్నారు. ఇన్నాళ్లు తాము పార్టీ కోసం పనిచేస్తే, పదవులు ఇచ్చే సమయానికి ఇతర పార్టీల వారు వచ్చి వాలిపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో తమ సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కట్టబెడుతుండటంపై జనసేన వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. కీలకమైన మేయర్, చైర్మన్ పదవులతోపాటు కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులను కూడా ఇతర పార్టీల వారే తన్నుకుపోతున్నారని అంటున్నారు. పార్టీకి కేటాయించిన రెండు మేయర్ సీట్లలో ఒకటి టీడీపీ నుంచి వచ్చిన వంగవీటి రాధాకృష్ణకు కేటాయించగా, 20 చైర్మన్ పదవులలో మెజార్టీ సంఖ్యలో స్థానాలు టీడీపీ మాజీ నేతలకే కట్టబెడుతున్నారని అంటున్నారు. అదే సమయంలో సాలూరు వంటి మున్సిపల్ చైర్మన్ పదవులను వైసీపీలో ఉన్న నాయకులకు కేటాయించారని జనసేన కేడర్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

లోపం ఎక్కడ ఉంది

ప్రతి ఎన్నికల సమయంలోనూ జనసేనలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని అంటున్నారు. పార్టీని స్థాపించి పుష్కర కాలమైనా పూర్తిస్థాయిలో నాయకులను తయారు చేసుకోలేకపోవడం అధిష్టానం వైఫల్యంగా చెబుతున్నారు. 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించగా, ఇప్పటి వరకు రెండు అసెంబ్లీ, రెండు మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కుందని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ పోటీకి దూరంగా ఉండిపోగా, 2019లో సొంతంగా 2024లో పొత్తుతో పోటీ చేసింది. అదేవిధంగా 2021 స్థానిక ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ప్రస్తుతం పొత్తుతో పోటీ చేస్తోంది. అయితే ఇన్ని ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న జనసేనకు ఇప్పటికీ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు పోటీ చేసే సమర్థుల కొరత ఎదుర్కుంటోందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కొందరు నాయకులను తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్లుగా ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కొనసాగిస్తోందని అంటున్నారు. రెండేళ్లుగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

నాయకులను తయారు చేసుకోలేరా..

రాజకీయాలు అంటే కేవలం అధికారం కోసం కాదని, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించాలనే ఆకాంక్షతో జనసేన ఆవిర్భవించింది. కుల, మత రహిత రాజకీయాలను ప్రోత్సహించడం, అట్టడుగు వర్గాల సంక్షేమం, యువతకు రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించడం లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ఆ ఆదర్శాలు మచ్చుకైనా కనిపించడం లేదని పార్టీ సానుభూతిపరుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో యువతకు ప్రోత్సాహం ఉండటం లేదని అంటున్నారు. పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసిన వారికి మొండిచేయి చూపుతూ, కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం, అందునా పదవుల కోసమే పార్టీలోకి వచ్చిన వారికి 24 గంటల్లో టికెట్లు ఇచ్చి ముందు వరుసలో కూర్చోబెడుతుండటాన్ని జనసేన సానుభూతిపరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి అధిష్టానమే పూర్తిగా బాధ్యత వహించాల్సివుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.