Begin typing your search above and press return to search.

‘పవన్ ను ముఖ్యమంత్రి చేసేందుకే జనసేన’ - ఎమ్మెల్యే నానాజీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ-జనసేన పొత్తు విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   18 Aug 2026 5:05 PM IST
‘పవన్ ను ముఖ్యమంత్రి చేసేందుకే జనసేన’ - ఎమ్మెల్యే నానాజీ సంచలన వ్యాఖ్యలు
X

టీడీపీ-జనసేన పొత్తు విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోసమే జనసేన పనిచేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన కొత్త వివాదానికి తెర తీశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘టీడీపీకి కాపు కాయడానికి జనసేన లేదు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికే పార్టీ పెట్టాం’ అంటూ ఎమ్మెల్యే నానాజి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఇరుపార్టీల మధ్య వేడి రాజేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. స్థానిక ఎన్నికల ముందు కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు బలమైన బంధంగా మారడంతో 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయం అందుకున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా పొత్తు ధర్మం పాటిస్తూ ఇరుపార్టీల అధినేతలు ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటున్నా, క్షేత్రస్థాయిలో వాతావరణం అలా లేదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బట్టి అర్థం అవుతోందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. పొత్తుల వల్ల తమకు సరైన గుర్తింపు రావడం లేదని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారా? అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసమే జనసేన పనిచేస్తున్నట్లు ఉందన్న రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు జనసేన శ్రేణులను ప్రభావితం అవుతున్నట్లు కనిపిస్తోందన్న అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు.

కూటమిగా మరో 15 ఏళ్లు కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అదే సమయంలో ఇరుపార్టీల ద్వితీయశ్రేణి నాయకులు కలిసిమెలిసి ఉండాలని, రాజకీయ ప్రత్యర్థుల పన్నాగాలను పసిగట్టి విభేదాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో నేతలు అధినేతల సూచనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్లు కనిపిస్తోందని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం అవసరమని, ఆయన విజన్ కోసం కలిసి పనిచేద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా చెబుతున్నప్పటికీ, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నాయకులు మాత్రం పవన్ ను ముఖ్యమంత్రి చేస్తామంటూ చేస్తున్న ప్రకటనలు వివాదానికి కారణమవుతున్నాయని అంటున్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టీడీపీకి కాపు కాయడానికి జనసేన లేదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడారో తెలియదు కానీ, టీడీపీ కార్యకర్తలు, నాయకులను రెచ్చగొట్టేలా ఉన్నాయని మాత్రం చెబుతున్నారు. ఇక ఈ అంశంపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది చూడాల్సివుందని అంటున్నారు.