రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!
నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో రూ.7 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో తమకు సంబంధం లేదని జనసేన నేతలు కల్యాణం శివశ్రీనివాసరావు, కోట రుక్మిణి స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా రాజకీయంగా తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
By: Tupaki Political Desk | 19 Nov 2026 1:32 PM ISTఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యవహారంపై జనసేన నేతలు ఎట్టకేలకు స్పందించారు. ఈ విషయంలో నిందితులను వదిలిపెట్టి ఉద్దేశపూర్వకంగా తమను టార్గెట్ చేస్తున్నారని జనసేన నేతలు కల్యాణం శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి స్పష్టం చేశారు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏడు కోట్లు వసూలు చేసిన నేరంపై రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్నామని చెప్పడమే కాకుండా, ఆ పార్టీకి చెందిన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు, కేంద్ర కార్యాలయ కార్యకలాపాలను పర్యవేక్షించే మహిళా నేత కోట రుక్మిణి పేర్లు వాడుకుని ఇద్దరు నిందితులు రూ.7 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తమ దృష్టికి వచ్చిన వెంటనే జనసేన నేతలు శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేస్తుండటంపై మీడియాకు వివరణ ఇచ్చారు.
ఈ నెల 11న జనసేన నేతలు కల్యాణం శ్రీనివాసరావు, కోట రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ స్కాం బయట పడింది. బాధితులు ఎవరూ పోలీసులను ఆశ్రయించకపోయినా, తమ పేర్లు జనసేన కేంద్ర కార్యాలయం చిరునామాను ఉపయోగించుకుని నిందితులు మోసం చేస్తున్నట్లు శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణికి సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అప్పటికే పరార్ అవగా, సహ నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా విపక్ష నేతలు తమను టార్గెట్ చేస్తున్నారని జనసేన నేతలు కల్యాణం శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై విపక్ష నేతల ఆరోపణలను తిప్పికొడుతూ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నిందితులు ఉపయోగించిన నకిలీ పత్రాలను మీడియా ఎదుట ప్రదర్శించారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ సంగతి తెలిసి నిందితురాలు తనకు వాట్సాప్ లో మెసేజ్ చేసిందని, తాను ఏ తప్పు చేయలేదని లేఖ రాసిందని తెలిపారు. ఈ విషయాన్ని సాక్ష్యంగా చూపేందుకు తాను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లానని వివరించారు. పవన్ నుంచి తనను వేరు చేసేందుకు పార్టీలో కొందరు నాయకులు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఇదే విషయంపై స్పందించిన కోట రుక్మిణి తన వాదనను వినిపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
తన వద్ద పనిచేస్తున్న నిందితురాలు ఉద్యోగాల పేరుతో మోసం చేసిందని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా నిందితురాలిని తన సంస్థ నుంచి తప్పించినట్లు వివరించారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ ను అనవసరంగా లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మౌనాన్ని బలహీనతగా, సహనాన్ని భయంగా చూడొద్దని హెచ్చరించారు. పార్టీకి అంకితభావంతో సేవలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టపరంగా పోరాడుతానని, పార్టీకి నాయకత్వానికి చెడ్డపేరు తేవాలనే కుట్రలను అడ్డుకుంటానని తేల్చిచెప్పారు.
కాగా, గత వారం రోజులుగా జనసేన కేంద్ర కార్యాలయం వేదికగా ఉద్యోగాల కుంభకోణం జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జనసేన కీలక నేతల వద్ద నిందితులు పనిచేశారని చెబుతున్నారు. దీనిని సాకుగా తీసుకుని కుంభకోణంలో జనసేన నేతలకు ప్రమేయం ఉందనే విధంగా ప్రచారం చేయడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం జోక్యం చేసుకుందని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే జనసేన నేతలే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని పార్టీ అధిష్టానం గమనించిందని అంటున్నారు. దీంతో పార్టీ నేతలతో వివరణ ఇప్పిండమే కాకుండా చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు.
