యువసేన: మారనున్న జనసేన.. !
కూటమి సర్కారులో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనలో తాజాగా `యువసేన` ఆవిర్భావం మరింతగా పార్టీని ప్రజలకు చేరువ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Garuda Media | 3 Sept 2026 12:00 AM ISTకూటమి సర్కారులో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనలో తాజాగా `యువసేన` ఆవిర్భావం మరింతగా పార్టీని ప్రజలకు చేరువ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ప్రారంభించిన 12 ఏళ్ల తర్వాత.. జనసేన ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం.. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేయడం వంటివి.. ఇప్పుడు పార్టీకి మరింత శోభను చేకూరుస్తాయన్న చర్చ పార్టీ నేతల్లోనూ జరుగుతోంది. ఇక, ఇప్పటికే.. వీర మహిళ విభాగం ఉంది. దీనికి యువ సేన తోడైతే.. ఆ లెక్క వేరుగా ఉంటుందని కూడా చెబుతున్నారు.
ప్రాధమికంగా 3 అంశాలు..
ప్రాథమికంగా మూడు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని జనసేన పార్టీ యువసేన విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది.
1) యువతను ఆకర్షించడం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జెన్‌జీ (30 ఏళ్లలోపు యువత) చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నా యి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వంటివి.. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం.. ఉద్యమాల అనంతరం.. యువత ను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకు కూడా జెన్‌జీ ఆకర్షణ తప్పని పరిస్థితి ఏర్పడింది. సో.. జనసేన వ్యూహం కూడా ఇదే.
2) ఓటు బ్యాంకు: వచ్చే 2029లో కూడా.. కూటమిని గెలిపించుకుని అధికారంలోకి రావాలన్నది జనసేన వ్యూహం. ఈ నేపథ్యంలోనే యువసేన విభాగాన్ని ఏర్పాటుచేస్తున్నారు. తద్వారా.. వచ్చే ఎన్నికల నాటికి యూత్ ఓట్లను ఒడిసి పట్టాలన్నది ప్రయత్నం. ప్రస్తుత అంచనా ప్రకారం.. వచ్చే 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 20 శాతం మేరకు యువత ఓటు బ్యాంకుగా మారనున్నారు. సో.. అటు వీరమహిళలు.. మహిళా ఓటు బ్యాంకును.. ఇటు యువ సేన.. యూత్ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకునేలా వ్యూహాత్మకంగా పావులు కదపనున్నారు.
3) కొత్తతరం: తరం మారుతున్న కొద్దీ రాజకీయాలు కూడా మారుతున్నాయి. అలానే.. పాతతరం నేతలపై అనేక విమర్శలు వివాదాలు కూడా కనిపిస్తున్నాయి. అదే కొత్త నేతలు.. ముఖ్యంగా యువ నేతలు రంగంలోకి వస్తే.. ఆ మజానే వేరుగా ఉంటుందన్నది పార్టీల అభిప్రాయం. ఈ కోణంలో కూడా జనసేన యువసేనకు ప్రాధాన్యం ఇస్తోంది. యువతకు మెజారిటీ సీట్లు ఇవ్వాలన్న సంకల్పం తద్వారా నెరవేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇలా.. మూడు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని యువసేనకు ప్రాణం పోస్తున్నారు.
