ఇంతకీ జనసేన గవర్నర్ ఎవరికి ఇస్తున్నారు ?
ఇక దేశంలో 28 రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు చెందిన వారు ఈ పదవులను అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
By: Satya P | 20 July 2026 9:54 AM ISTసైలెంట్ గానే జనసేన ఒక సంచలన విషయం రివీల్ చేసింది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన అంశం అంటూ ఆ పార్టీలో నంబర్ టూ నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ ముద్రగడ పద్మనాభానికి గవర్నర్ పదవి అంటూ ఒక పాత ముచ్చట చెప్పారు. ముద్రగడ కనుక గతంలో తమ పార్టీలో చేరి ఉంటే ఆయనకు గవర్నర్ పదవిని ఇచ్చేవారమని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ఇన్నాళ్ళుగా ఎక్కడా కనీసం లీక్ గా కూడా లేని ఈ విషయం ఇంత సడెన్ గా ప్రస్తావించడం పైన తలో రకంగా వ్యాఖ్యానాలు చేసిన వారూ ఉన్నారు. అయితే అదే సమయంలో జనసేనకు ఒక గవర్నర్ పదవి అన్నది కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది అన్నది కూడా నాదెండ్ల చెప్పకనే చెప్పేశారు అని అంటున్నారు.
తొందరలో గవర్నర్ల ఖాళీలు :
ఇక దేశంలో 28 రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు చెందిన వారు ఈ పదవులను అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఎన్డీయేకు మిత్రపక్షంగా ఏపీ నుంచి టీడీపీ జనసేన ఉన్నాయి. దాంతో మిత్రుల కోటాలో గవర్నర్ పదవులు ఈ పార్టీలకు కూడా బీజేపీ ఇస్తుంది అని ప్రచారం ఈ మధ్యన గట్టిగానే నడుస్తోంది. టీడీపీ కోటా కింద ఇప్పటికే విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవిని ఇచ్చారు. అదే సమయంలో మరో గవర్నర్ పదవి కూడా టీడీపీకి ఇస్తారు అని అంటున్నారు. ఇక జనసేనకు కూడా గవర్నర్ పదవి ఇవ్వడం ఖాయమని ప్రచారం సాగుతోంది.
రాజ్ భవన్ కి ఎవరు :
జనసేన కోటాలో గవర్నర్ పదవి కనుక కేటాయిస్తే ఆ పార్టీ నుంచి ఎవరిని గవర్నర్ గా రాజ్ భవన్ కి పంపుతారు అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది. గవర్నర్ అంటే సీనియర్ నేతగా ఉంటూ రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నవారు గతంలో ఎంపీ ఎమ్మెల్యే వంటి పదవులు నిర్వహించిన వారికి ప్రయారిటీ ఇస్తారు. ఒక్కోసారి న్యాయ కోవిదులకు రాజ్యాంగ అంశాల పట్ల అవగాహన ఉన్న మేధావులకు కూడా ఈ పదవులు ఇస్తారు. జనసేన విషయం తీసుకుంటే ఎంతో మంది ఆ పార్టీలో ఉన్నారు. ఇక ప్రత్యక్షంగా కనిపించే వారు కాకుండా పరోక్షంగా పార్టీ కోసం పనిచేసే మేధావులు ఉన్నారు. మరి ఎవరికి ఈ కీలక పదవి ఇస్తారు అన్నదే చర్చగా ఉంది.
కేంద్ర మంత్రివర్గం తరువాత :
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం మొదలయ్యాయి. ఆగస్టు వరకూ ఇవి సాగుతాయి. ఆ మీదట కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. అది పూర్తి అయిన తరువాత గవర్నర్ పదవుల నియామకాలు ఉండొచ్చు అని అంటున్నారు. మరి జనసేన కోటాలో ఎవరికి ఈ అగ్ర తాంబూలం దక్కుతుంది అన్నదే చర్చగా ఉంది. నిజానికి ముద్రగడ వంటి వారికి ఈ కీలక పదవి ఇస్తే ఎంతో న్యాయం చేసినట్లు అయేదని కూడా అంటున్నారు. కానీ ఆయన ఇపుడు ఈ లోకంలోనే లేరు. దాంతో జనసేన గవర్నర్ పదవి ప్రస్తావన తెచ్చింది కాబట్టి ఆ పార్టీకి కచ్చితంగా ఒకటి ఖాయం అని తెలుస్తోంది. మరి ఎవరా అదృష్టవంతులు అన్నదే చూడాల్సి ఉంది.
