ఎల్ నినో ఎఫెక్ట్....రేవంత్ సర్కార్ కు జనసేన దిశా నిర్దేశం !
కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ప్రజలకు భరోసా కల్పించే విషయంలో తెలంగాణా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని ఆయన కోరారు.
By: Satya P | 25 Oct 2026 8:12 PM ISTతెలంగాణాలో జనసేన యాక్టివ్ అవుతోంది. తాజాగా చూస్తే ముంచుకొస్తున్న ఎల్ నినో విషయంలో ముందస్తు కార్యాచరణ ప్రకటించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జనసేన కోరుతోంది ఎల్ నినో వల్ల అనేక రంగాలు ఇబ్బందులలో పడతాయని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్‌చార్జ్ నేమూరి శంకర్‌గౌడ్ గుర్తు చేశారు. నీటి లభ్యత తగ్గిపోతుందని, వ్యవసాయం కుంటుపడుతుందని, అలాగే విద్యుత్ సరఫరాపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలకు భరోసా :
కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ప్రజలకు భరోసా కల్పించే విషయంలో తెలంగాణా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే ఎల్ నినో ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని అన్నారు. జిల్లాలవారీ వర్షపాతం లోటు కానీ జలాశయాల నీటి నిల్వలు కానీ అలాగే నీటి వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు కానీ భూగర్భ జలాల పరిస్థితి కానీ మారుతుందని అన్నారు. అలాగే పంటల అవసరాలను ఎంత నీరు అవసరం అన్నది సమగ్రంగా అంచనా వేయాలని కోరారు. వర్షాభావం లెక్కలతో పాటు అధిక నీటి వినియోగం, అక్రమ నీటి మళ్లింపులు, చెరువుల ఆక్రమణలు ఎంతవరకు నీటి కొరతకు కారణమవుతున్నాయో గుర్తించాలని కోరారు. ఎల్ నినో ప్రభావం నేపధ్యంలో తాగునీటికి ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు.
తక్కువ నీటితో పంటలు :
ఎల్ నినో వల్ల వర్షాభావం ఉంటుందని అందువల్ల తక్కువ నీటితో సాగు చేసే పంటల వైపుగా రైతులను మళ్ళించే విధంగా ప్రభుత్వం దిశానిర్దేశం చేయాలని నేమూరి శంకర్‌గౌడ్ కోరారు. ఇలా పంట మార్పు వల్ల రైతులపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం గుర్తించి తగిన భరోసా కల్పించాలని అన్నారు. అలాగే పాడి రైతులకు పశుగ్రాసంతో పాటు పశువులకు తాగునీరు అందించే ఏర్పాట్లు కూడా చేయాలని అన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లభ్యం అయ్యేలా చూడాలని కూడా కోరారు.
తాగు నీరు ముఖ్యం :
కోటి మందికి పైగా జనాభా ఉండే హైదరాబాద్‌లో నివాస ప్రాంతాలు అద్దె కుటుంబాలు, బస్తీలు, శివారు కాలనీలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రాంతాల వారీగా తాగు నీటి సరఫరా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. అలాగే అత్యవసరమైన వేళలలో ట్యాంకర్ల ద్వారా సరఫరాకు స్పష్టమైన విధానం ఉండాలని అన్నారు. అనుమతి లేని బోర్లు, అక్రమ పైపులైన్లు, తాగునీటి అక్రమ మళ్లింపులపై రెవెన్యూ, భూగర్భ జల, పోలీస్, జలమండలి అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కోరారు. గ్రామీణ ప్రాంతంలో సైతం తాగు నీటి అవసరాలను గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవడం అవసరం అన్నారు.
కరెంట్ విషయంలోనూ :
ఇక ఎల్ నినో ప్రభావంతో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని అందువల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, అందుబాటులో ఉన్న సరఫరా వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని నేమూరి శంకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇక వ్యవసాయానికి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, ఆసుపత్రులు, తాగునీటి పంపింగ్ కేంద్రాలకు నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యాలను గుర్తించడం, తక్కువ వోల్టేజ్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
ధరలు పెరగకుండా :
ఎల్ నినో వల్ల అహార ఉత్పత్తి తగ్గి నిత్యావసర ధరలు నింగికి ఎగబాకుతాయని ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం నిరంతర నియంత్రణతో కూడిన పర్యవేక్షణ అవసరం అని జనసేన పేర్కొంటోంది. కృత్రిమ కొరత సృష్టించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలని ఆ పార్టీ కోరింది. ఇక ఎల్ నినో వల్ల ఒక్కోసారి భారీ వర్షాలు వరదల వంటి ప్రమాదాలు సంభవిస్తాయని వాటి విషయంలో అప్రమత్తత అవసరం అని జనసేన సూచించింది. చెరువుల పటిష్టత, వరద ప్రవాహ మార్గాల నిర్వహణపై ముందస్తు చర్యలు చేపట్టాలని కోరింది.
