Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలే జనసేన అభ్యర్థులు! పొత్తుల రాజకీయాలపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్

బలం లేకపోయినా జన సేన కొన్ని మున్సిపాలిటీలను తీసుకుందని, అక్కడ సరైన అభ్యర్థులు లేక తెల్ల ముఖం వేస్తోందని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   17 Oct 2026 12:33 PM IST
టీడీపీ నేతలే జనసేన అభ్యర్థులు! పొత్తుల రాజకీయాలపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్
X

స్థానిక ఎన్నికల్లో కూటమి రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అభ్యర్థులను పోటీకి నిలిపే విషయంలో చోటుచేసుకున్న రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన టీడీపీపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిన జనసేన, బీజేపీ పార్టీలు తమ కోటాలో వచ్చిన సీట్లలో సరైన అభ్యర్థులను పోటీకి పెట్టే విషయంలో ముల్లాగుల్లాలు పడుతున్నాయన చెబుతున్నారు. 4 మేయర్, 20 మున్సిపాలిటీలకు అభ్యర్థులను నిలిపే విషయంలో జనసేన అనుసరిస్తున్న వైఖరిపై సొంత పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న వారి బదులుగా టీడీపీ నుంచి నాయకులను దిగుమతి చేసుకుని వారినే జనసేన అభ్యర్థులుగా పోటీకి పెట్టడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

జనసేన పార్టీ అభ్యర్థులుగా టీడీపీ నేతలే మున్సిపల్ ఎన్నికల బరిలో దిగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆ మాత్రం దానికి జనసేన వాటా సీట్లు అంటూ ప్రచారం చేసుకోవడం ఎందుకని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఈ పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన, బీజేపీలకు మున్సిపాలిటీలను ఇచ్చేసిన తర్వాత నాయకులను కూడా పంపాల్సిన పరిస్థితులు ఏర్పడటమే వారిని ఆవేదనకు గురిచేస్తోందని అంటున్నారు.

పొత్తుల్లో భాగంగా జనసేన నాలుగు కార్పొరేషన్లలో పోటీ చేస్తుండగా, రెండు కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ప్రధానమైన విజయవాడ కార్పొరేషన్ అభ్యర్థిగా సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణను ఖరారు చేశారు. రాధాకు మేయర్ సీటు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కూడా ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రాధాకృష్ణ నిన్నమొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు కండువా మార్చుకుని జనసేన తరఫున మేయర్ గా పోటీ చేయడంపై కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా చోట్ల ఉందని అంటున్నారు.

జనసేనకు కేటాయించిన పలు మున్సిపాలిటీలో చైర్మను అభ్యర్థులుగా టీడీపీ వారే పోటీకి దిగుతున్నారని, పదవి కోసం కండువా మార్చుకుని జనసేన గుర్తుపై పోటీకి సిద్ధమవుతున్నారని అంటున్నారు. తుని మున్సిపల్ సీటు విషయంలో ఇదే జరగ్గా, రామచంద్రాపురంలో కూడా జనసేనలోకి వచ్చి టీడీపీ నేతలు పోటీకి సిద్ధమవడంపై కార్యకర్తలు ముఖంమీదే నిలదీస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

బలం లేకపోయినా జన సేన కొన్ని మున్సిపాలిటీలను తీసుకుందని, అక్కడ సరైన అభ్యర్థులు లేక తెల్ల ముఖం వేస్తోందని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు నచ్చజెప్పడం మంత్రులు, ఎమ్మెల్యేలకు భారం అవుతూందని అంటున్నారు. మన్యం జిల్లాలోని సాలూరు మున్సిపాలిటీని జనసేనకు కేటాయించగా, అక్కడ సరైన అభ్యర్థే లేరని, 2 శాతం ఓటింగుతో జనసేన ఎవరిని నిలబెడుతుందని టీడీపీ నాయకులు నిలదీస్తున్నారు. ఇదే సమయంలో కార్యకర్తల బాధను చూడలేక మంత్రి సంధ్యారాణి కన్నీరు పెట్టుకున్నారు. ఇక విజయనగరం జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఈ నియోజకవర్గంలో రాజాం, నెల్లిమర్ల నగర పంచాయతీలను జనసేనకు కేటాయించారు. అయితే రాజాంలో జనసేనకు సరైన నాయకులు లేరని, అవసరమైతే ఆ పార్టీలోకి టీడీపీ నాయకులే వెళ్లి పోటీ చేయాల్సివుంటుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ పరిణామాలు గమనిస్తుంటే పొత్తుల్లో భాగంగా సీట్లు తీసుకున్న జనసేన, అక్కడ సరైన అభ్యర్థులు ఉన్నారా? లేరా? అన్నది ముందుగా పరిశీలించలేదని అంటున్నారు. దీనివల్ల టీడీపీ నాయకులే కండువాలు మార్చుకుని జనసేన తరఫున పోటీకి దిగాల్సిన పరిస్థితులు నెలకున్నాయని అంటున్నారు. దీనిపై రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు, నిరసన స్వరాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ విజయం కోసం అంతా కలిసి పనిచేస్తామని పైకి చెబుతున్నారని, అయితే ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సివుందని అంటున్నారు. మొత్తానికి తాజా ఎన్నికలు మరోసారి నేతల సర్దుబాటుపై హాట్ టాపిక్ అవుతున్నాయి.